పుల్వామా ఎఫెక్ట్‌!..అక్క‌డే అమ్మాయి - ఇక్క‌డే అబ్బాయి!

Update: 2019-03-06 06:26 GMT
భార‌త్ లో అల్ల‌క‌ల్లోలం సృష్టించడ‌మే ల‌క్ష్యంగా పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్న ఉగ్ర‌వాద సంస్థ‌ల‌కు ఆశ్ర‌యం ఇస్తున్న పాకిస్థాన్ వైఖ‌రి నిత్యం వివాదాస్ప‌దంగానే మారిపోయింది. ముంబై దాడులు నుంచి నిన్న జ‌రిగిన పుల్వామా ఉగ్ర‌దాడి వ‌ర‌కు దాదాపుగా భార‌త్ లో జ‌రిగిన అన్ని దాడులు కూడా పాక్ భూభాగం మీదే రూపొందాయ‌ని చెప్పాలి. పాక్ ఆశ్ర‌యంలో సేఫ్‌ గానే కాకుండా లగ్జరియ‌స్ లైఫ్‌ ను ఎంజాయ్ చేస్తున్న ఉగ్ర‌వాదులు... ఇరు దేశాల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌త‌ల‌కు కార‌ణం అవుతున్నారు. అయితే ఈ వాస్త‌వాన్ని గుర్తించినా... గుర్తించ‌నట్టే న‌టిస్తున్న పాకిస్థాన్ వైఖరి కార‌ణంగా ఇటు భార‌తీయుల‌తో పాటు అటు పాకిస్థానీలు కూడా తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు.

ఇప్పుడు ఈ విష‌యాన్ని ఎందుకింత ప్ర‌త్యేకంగా చెప్పాల్సి వ‌స్తోందంటే... మొన్న‌టి పుల్వామా ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో ఇరు దేశాల మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త‌త పుణ్య‌మా అని... భార‌త్ కు చెందిన అబ్బాయి - పాక్‌ కు చెందిన అమ్మాయికి కుదిరిన పెళ్లి ఉన్న‌ప‌ళంగా ర‌ద్దైపోయింది. నిశ్చితార్ధం జ‌రుపుకుని వెడ్డింగ్ కార్డుల‌ను బంధు వ‌ర్గానికి పంచేసుకుని నిన్న ఒక్క‌ట‌య్యేందుకు సిద్ధ‌మైన ఈ జంట‌... పెళ్లి పీట‌లు ఎక్కే అవ‌కాశం ద‌క్క‌క‌పోవ‌డంతో తీవ్ర నిరాశ‌లో కూరుకుపోయారు. ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకి వెళితే... భార‌త్ కు చెందిన మ‌హేంద్ర సింగ్ కు - పాకిస్థాన్‌ కు చెందిన చ‌గ‌న్ క‌న్వ‌ర్‌ తో పెళ్లికి పెద్ద‌లు నిశ్చ‌యించారు. మూడేళ్ల నాడే ఈ నిర్ణ‌యం జ‌ర‌గ‌గా... అప్పుడే ఎంగేజ్ మెంట్ కూడా జ‌రిగిపోయింది. తాజాగా నిన్న వివాహంతో ఒక్క‌ట‌వ్వాల‌ని వారు నిర్ణ‌యించుకున్నారు. పాక్ లోని చ‌గ‌న్ క‌న్వ‌ర్ ఇంట‌నే పెళ్లి జ‌ర‌గాల్సి ఉంది. పెళ్లి సంబ‌రాల్లో మునిగిన ఇరు కుటుంబాలు కూడా ఇప్ప‌టికే బంధువ‌ర్గానికి వెడ్డింగ్ కార్డులు పంచేశాయి.

పెళ్లి వేడుక‌కు పాక్‌ కు త‌ర‌లివెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఈ క్ర‌మంలో పుల్వామా దాడి ఫ‌లితంగా ఇరు దేశాల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. వెర‌సి పాక్‌ కు వెళ్లేందుకు మ‌హేంద్ర సింగ్ ఫ్యామిలీకి వీసాలు దొర‌క‌లేదు. అయితే పెళ్లి ముహూర్తం ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో ఓ అధికారి కాళ్లావేళ్లా ప‌డ్డ మ‌హేంద్ర సింగ్ ఎలాగోలా ఓ ఐదుగురిగి వీసా ద‌క్కించుకున్నారు. ప‌రిస్థితి బాగా లేన‌ప్పుడు ఆ ఐదుగురితోనే క‌లిసి వెళ్లి పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. అయితే పుల్వామా దాడి త‌ర్వాత పాకిస్థాన్ ప్ర‌భుత్వం ఇరు దేశాల మ‌ధ్య తిరుగుతున్న సంఝౌతా ఎక్స్‌ ప్రెస్‌ ను ర‌ద్దు చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఇత‌ర ప్ర‌త్యామ్నాయాల‌ను చూసినా పాక్ వెళ్లేందుకు మ‌హేంద్ర‌కు సింగిల్ దారి కూడా క‌నిపించ‌లేదు. దీంతో ఈ నిన్న జ‌ర‌గాల్సిన పెళ్లిని ఇరు కుటుంబాలు వాయిదా వేసుకోక త‌ప్ప‌లేదు. మ‌రి ఈ జంట పెళ్లి పీట‌లు ఎక్కుతుందో - లేదంటే... ఇరు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌లు కంటిన్యూ అయి శాశ్వ‌తంగా దూరంగానే ఉండిపోతుందో చూడాలి.



Tags:    

Similar News