బాబుపై వార్ ప్లాన్ చెప్పిన అమిత్ షా

Update: 2018-03-18 09:21 GMT
నిన్న‌టి వ‌ర‌కూ మిత్రులు ఇప్పుడు శ‌త్రువుల‌య్యారు. నిన్న‌టి వ‌ర‌కూ ఒక‌రికొక‌ర‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న వారు ఎవ‌రి దారి వారిద‌న్న‌ట్లుగా మారారు.. ఒక‌రి త‌ప్పుల్ని మ‌రొక‌రు క‌వ‌ర్ చేసుకుంటున్న వైనానికి భిన్నంగా.. త‌ప్పులేం దొరుకుతాయంటూ భూత‌ద్దం వేసుకొని వెతికే ప‌ని మొద‌లైంది.

బీజేపీతో నాలుగేళ్ల బంధానికి క‌టీఫ్ చెప్పేసిన చంద్ర‌బాబు తీరుతో.. ఫ్యూచ‌ర్ వార్ ప్లాన్ ను సిద్ధం చేశారు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా. ప్ర‌త్యేక హోదా అంశం సెంటిమెంట్ గా మారి.. ఏపీ ప్ర‌జ‌లు తీవ్ర భావోద్వేగంతో ఉన్న వేళ‌.. పార్టీ నేత‌ల‌కు వార్ ప్లాన్ చెప్పేశారు అమిత్ షా.

ప్ర‌జ‌ల ముందు త‌మ‌ను దోషిగా నిల‌బెట్టే ప్ర‌య‌త్నం చేసే బాబు బ్యాచ్ ను ఎలా ఎదుర్కోవాల‌న్న అంశంపై అమిత్ షా క‌మ‌ల‌నాథుల‌కు దిశానిర్దేశం చేయ‌టం గ‌మ‌నార్హం. విభ‌జ‌న హామీలు అమ‌లు చేయ‌లేద‌ని చెబుతూ ఎన్డీయే ప్ర‌భుత్వం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసిన చంద్ర‌బాబు టీంపై దండ‌యాత్ర‌ను షురూ చేయాల‌న్న సిగ్న‌ల్ ను బీజేపీ చీఫ్ అమిత్ షా  ఇచ్చేసిన‌ట్లుగా తెలిసింది.

ఎన్డీయే కూట‌మి నుంచి తాను  వైదొలుగుతున్న‌ట్లుగా అమిత్ షాకు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు లేఖ రాశారు. దీనికి కౌంట‌ర్ అన్న‌ట్లుగా బాబుకు త్వ‌ర‌లో తాను లేఖ రాస్తాన‌ని.. అందులో ఉండే అంశాల్ని జ‌న‌బాహుళ్యంలోకి తీసుకెళ్లేలా చూడాల‌ని అమిత్ షా చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. హోదా ఎపిసోడ్ లో బీజేపీని దోషిగా నిల‌బెట్టిన టీడీపీపై దంయాత్ర‌ను షురూ చేయాల‌న్న‌ట్లు స‌మాచారం. ఏపీలో బీజేపీ విప‌క్షం రోల్ ను ప్లే చేయాల‌ని.. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాన్ని ఎండ‌గొట్టాల‌న్నారు. ఏపీలోని ప్ర‌ధాన రాజ‌కీయ ప‌క్షాల్ని ఢీ కొట్టాలంటూ బీజేపీ నేత‌ల‌కు స్ప‌ష్టం చేసిన‌ట్లుగా తెలుస్తోంది.

ప్ర‌త్యేక హోదా ప్ర‌క‌ట‌న సాధ్యం కాద‌ని.. దానికి బ‌దులుగా స‌మాన ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్న‌ట్లుగా ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌న్నారు. టీడీపీ మంత్రులు కేంద్ర క్యాబినెట్ నుంచి ఎందుకు వైదొలిగారో ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌న్నారు. ఎన్టీయే నుంచి బాబు పార్టీ వైదొల‌గ‌టం ఎందుక‌న్న అంశంపై  రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌చారం చేయాల‌ని సూచించారు. విభ‌జ‌న చ‌ట్టంలోని అన్ని అంశాల్ని ఒకేసారి ఇస్తే టీడీపీ ఒత్తిడితోనే ఇచ్చిన‌ట్లు అవుతుంద‌ని.. నెలా.. రెండు నెల‌ల త‌ర్వాత ఒక్కొక్క స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిద్దామ‌ని చెప్పిన‌ట్లుగా స‌మాచారం.

తెలుగుదేశం పార్టీ మీదా.. వారి ప్ర‌భుత్వం మీద విమ‌ర్శ‌ల దాడి పెంచాల‌న్న అమిత్ షా.. "వారు మ‌న పార్టీపై ప్ర‌జ‌ల్ని ఉసిగొల్ప‌టంలో విజ‌య‌వంతం అవుతున్నారు. మ‌నం కూడా వారి త‌ర‌హాలోనే దాడి తీవ్ర‌త‌ను పెంచాలి. కౌంట‌ర్ వేయ‌టం ప్ర‌ధానం" అని చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది.  బాబు స‌ర్కారుపై ప‌వ‌న్ క‌ల్యాణ్ అవినీతి ఆరోప‌ణ‌లు చేసిన వైనాన్ని అమిత్ షా దృష్టికి వెళ్లిన‌ప్పుడు ఆయ‌న స్పందిస్తూ.. ఆ అంశాల్ని ప‌రిశీలించాల‌ని.. అవినీతికి సంబంధించిన ఆధారాలు ఉంటూ మాట్లాడాల‌ని చెప్పిన‌ట్లుగా తెలిసింది.

ఏపీకి బీజేపీ ఏం చేసింది?  ఏం చేయాల‌నుకుంటున్న వైనాన్ని క‌మ‌ల‌నాథులు క్షేత్ర‌స్థాయిలోకి తీసుకెళ్లాల‌న్న అమిత్ షా.. ఏపీ రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తికి నిధులు ఇచ్చినా.. రాజ‌ధానిలో క‌ద‌లిక లేద‌న్న వాద‌న‌ను పెంచాల‌ని చెప్పిన‌ట్లుగా స‌మాచారం. కేంద్ర నిధుల వినియోగ‌ప‌త్రాలు లేవ‌ని.. హోదాకు స‌మాన‌మైన మొత్తాన్ని ఈఏపీలు.. నాబార్డు.. స్పెష‌ల్ ప‌ర్ప‌స్ వెహికల్ ద్వారా ఇవ్వాల‌ని బాబు అడిగిన లేఖ‌లు ఉన్నాయ‌ని.. వాటంన్నింటిని అంగీక‌రించినా ఎందుకు తీసుకోలేదో ప్ర‌శ్నించాల‌న్నారు. బాబు చేసిన త‌ప్పుల్ని వెతకాలంటూ రామ్ మాధ‌వ్ బీజేపీ నేత‌ల‌కు సూచ‌న చేసిన‌ట్లుగా తెలిసింది. ఢిల్లీ నుంచి కూడా బాబు స‌ర్కారుపై త‌గిన ఆధారాలు బ‌య‌ట‌పెట్టేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. ఏమైనా.. రానున్న రోజుల్లో తెలుగు త‌మ్ముళ్ల‌కు.. బీజేపీ నేత‌ల‌కు మధ్య రాజ‌కీయ శ‌త్రుత్వం అంత‌కంత‌కూ పెర‌గ‌టం ఖాయ‌మ‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.
Tags:    

Similar News