అమిత్ షా బ్యాంక్‌ కు పెద్ద‌నోట్ల వ‌ర‌ద‌!

Update: 2018-06-22 04:55 GMT
అవినీతికి చెక్ పెట్టేందుకు.. అక్ర‌మార్కుల‌కు దిమ్మ తిరిగిపోయేలా ప్ర‌ధాని పెద్ద‌నోట్లను ర‌ద్దు చేస్తూ సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లుగా జ‌రిగిన ప్ర‌చారం అంతా ఇంతా కాదు. కానీ.. ఈ నిర్ణ‌యంతో  మోడీకి నీడ‌.. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాకు  భారీ ప్ర‌యోజ‌నం చేకూరిందా? అన్న అనుమానాలు రేకెత్తే సంచ‌ల‌న విష‌యం ఒక‌టి తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద చేసిన ఒక ద‌ర‌ఖాస్తుకు వ‌చ్చిన స‌మాధానాన్ని విశ్లేషిస్తే.. షాకింగ్ నిజం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్నారు.

మోడీ తీసుకున్న పెద్ద‌నోట్ల ర‌ద్దు అమిత్ షాకు ప్ర‌యోజ‌నం క‌లిగేలా చేసిందా? అన్న‌ది ఇప్పుడు అనుమానంగా మారింది. పెద్ద‌నోట్ల ర‌ద్దు అనంత‌రం చోటు చేసుకున్న చీక‌టి కోణాల‌కు సంబంధించిన కీల‌క స‌మాచారం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చిందంటున్నారు.

మోడీ.. అమిత్ షాల సొంత రాష్ట్ర‌మైన గుజ‌రాత్ లోని ఒక జిల్లా స‌హ‌కార బ్యాంకుకు అమిత్ షా డైరెక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రించారు. పెద్ద‌నోట్ల ర‌ద్దు అనంత‌రం.. ర‌ద్దు అయిన నోట్ల‌ను భారీగా జ‌మ చేసుకున్న బ్యాంకుల్లో షా బ్యాంక్ అగ్ర‌స్థానంలో నిలిచిన వైనం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. పెద్దనోట్ల ర‌ద్దు నిర్ణ‌యాన్ని ఆ బ్యాంకు లాభ‌దాయ‌కంగా మార్చుకున్న‌ట్లుగా చెబుతున్నారు.

ప్ర‌ధాని మోడీ సొంత రాష్ట్రంలో రెండు పెద్ద జిల్లా స‌హ‌కార బ్యాంకుల్లో అధిక మొత్తంలో ర‌ద్దైన పెద్ద‌నోట్ల‌ను తీసుకున్న‌ట్లుగా తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చిన గ‌ణాంకాలు వెల్ల‌డిస్తున్నాయి. ఈ రెండు బ్యాంకుల్లో ఒక‌టి అహ్మ‌దాబాద్ డీసీసీబీ కాగా.. రెండోది రాజ్ కోట్ డీసీసీబీది. రెండోదానిలో అమిత్ షా డైరెక్ట‌ర్ గా ఉండ‌టం గ‌మ‌నార్హం. ఈ సంచ‌ల‌న విష‌యాల్ని ముంబ‌యికి చెందిన మ‌నోరంజ‌న్ రాయ్ అనే స‌మాచార హ‌క్కు పిటీష‌న్ ద్వారా వివ‌రాలు బ‌య‌ట‌కు వెల్ల‌డ‌య్యాయి.

2016 న‌వంబ‌రు 8 రాత్రి వేళ‌.. ప్ర‌ధాన‌మంత్రి మోడీ పెద్ద‌నోట్లు (రూ.వెయ్యి.. 500) ర‌ద్దు చేస్తూ ఆక‌స్మిక నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించి సంచ‌ల‌నం సృష్టించారు.అదే స‌మ‌యంతో ప్ర‌జ‌లు త‌మ వ‌ద్ద ఉన్న పెద్ద‌నోట్ల‌ను డిసెంబ‌రు 30లోపు బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల‌ని సూచించారు. దీంతో.. పెద్ద ఎత్తున నోట్లు బ్యాంకుల‌కు చేరాయి. ఈ క్ర‌మంలో అహ్మ‌దాబాద్ డీసీసీబీ కేవ‌లం ఐదు రోజుల వ్య‌వ‌ధిలో రూ.745.59 కోట్ల విలువైన ర‌ద్దైన పెద్ద‌నోట్ల‌ను జ‌మ చేసుకుంటే.. అమిత్ షా డైరెక్ట‌ర్ గా ఉన్న రాజ్ కోట్ డీసీసీబీ రూ.693.19 కోట్ల‌ను డిపాజిట్ చేసుకోవ‌టం గ‌మ‌నార‌హం.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే రాజ్ కోట్ డీసీసీబీ బ్యాంకుతో పాటు.. అహ్మ‌దాబాద్ డీసీసీబీకి 2000లో ఛైర్మ‌న్ గా వ్య‌వ‌హ‌రించిన షా.. త‌ర్వాతి కాలంలో డైరెక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక‌.. పెద్ద‌నోట్ల ర‌ద్దు వేళ డీసీసీబీ ఛైర్మ‌న్ గా వ్య‌వ‌హ‌రించిన జ‌యేశ్ భాయ్ విఠ‌ల్ భాయ్ అయితే ప్ర‌స్తుతం విజ‌య్ రూపానీ మంత్రివ‌ర్గంలో మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

డీసీసీబీల ద్వారా బ్లాక్‌మ‌నీని అనేక‌మంది తెలుపు చేసుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు రావ‌టంతో త‌ర్వాతి కాలంలో ప్ర‌భుత్వం పెద్ద‌నోట్ల జ‌మ‌ను ఆయా బ్యాంకుల నుంచి తొల‌గించింది. అయితే.. అప్ప‌టికే వేలాది కోట్ల రూపాయిల మొత్తం ఆయా బ్యాంకుల్లో జ‌మ అయ్యాయి. అయితే.. అలా జ‌మ అయిన మొత్తాన్ని నేటివ‌ర‌కూ విచార‌ణ జ‌రిపింది లేదు. స‌మాచార హ‌క్కు చ‌ట్టం ద్వారా వెల్ల‌డైన ఈ స‌మాచారం రాజ‌కీయంగా ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. మ‌రి.. దీనిపై అమిత్ షా ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News