పవన్ ఫైరింగ్ తో బాబుతో తగదాలొద్దన్నారట

Update: 2016-09-11 05:29 GMT
బీజేపీ అధినాయకత్వానికి ఏపీ బీజేపీ నేతలు ఒక్కసారి గుర్తుకు వచ్చేశారు. నిత్యం బిజీబిజీగా ఉంటూ.. ముఖ్యమంత్రులకు సైతం అపాయింట్ మెంట్ ఇచ్చేందుకు సైతం నెలలకు.. నెలలు తిప్పే ఆయన.. ఏపీ బీజేపీ నేతలకు అపాయింట్ మెంట్ ఇచ్చేశారు. గార్డెన్ లో కూర్చొబెట్టుకొని మరీ.. ‘దిశానిర్దేశం’ చేసిన ఆయన.. భవిష్యత్ మీద భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఏపీకి ప్రకటించిన ప్యాకేజీతో రాష్ట్రంలో బీజేపీని చంపేశారంటూ పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడిన పక్క రోజునే దేశ రాజధానిలో ఆ పార్టీ నేతల్ని కూర్చోబెట్టుకున్న మోడీ వారికి మనో ధైర్యాన్ని కలిగించే ప్రయత్నం చేశారు.

ప్రధాని తీరు ఇలా ఉంటే.. పార్టీ చీఫ్ అమిత్ షా వ్యవహారం మరోలా ఉండటం గమనార్హం. అవసరం ఉన్నా లేకున్నా బాబు సర్కారుపై తరచూ విమర్శలు చేస్తే పట్టించుకోని అమిత్ షా.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా స్పందించటం కనిపిస్తుంది. టీడీపీతో తగాదాలు పెట్టుకోవద్దని హిత బోధచేసిన ఆయన.. ఆ పార్టీతో కలిసి పని చేయాలని చెప్పారు. బీజేపీ నిర్వహించే సభల్లో టీడీపీ నాయకులకూ భాగస్వామ్యం కల్పించాలన్న విషయాన్ని చెప్పిన అమిత్ షా.. హోదా కంటే కూడా ప్యాకేజీతోనే ఎక్కువ లాభం కలిగే అవకాశం ఉంటుందన్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని.. అందుకోసం సభలు పెట్టాలని చెప్పటం గమనార్హం.

14వ ఆర్థిక సంఘం సిఫార్సుల నేపథ్యంలో హోదా ఇవ్వలేకపోయామని.. ఆ సిఫార్సులపై 2014 జనవరిలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సంతకం చేసిన సంగతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఏపీ బీజేపీ నేతలకు అమిత్ షా సూచించటం గమనార్హం. విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశాన్నిచేర్చలేదన్న విషయాన్ని అమిత్ షా గుర్తు చేయటం.. టీడీపీతో కలిసే ప్రత్యేక ప్యాకేజీని రూపొందించామనటం విశేషం. బీజేపీ.. టీడీపీ రెండు పార్టీలూ కలిసే ప్రజలకు ప్రయోజనం కలిగించే ప్యాకేజీని తయారు చేసిన అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు.

నిన్నటి వరకూ ఏపీలో తమకు తిరుగులేదన్నట్లుగా మాటలు చెప్పిన ఏపీ బీజేపీ నేతలకు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ పేరు చెప్పుకొని బతికేయాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని అమిత్ షా మాటల్లో స్పష్టంగా వినిపించటం గమనార్హం. గతంలో అవసరం లేకున్నా తగాదాలు పెట్టుకున్న తమ పార్టీ నేతల వైఖరిని తప్పు పట్టని అమిత్ షా ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారు. టీడీపీతో చెట్టాపట్టాలు వేసుకోవాలంటూ చెప్పిన మాటల్ని చూస్తే.. ఏపీలో టీడీపీ అవసరం తమకెంతన్న విషయాన్ని అమిత్ షా చెప్పినట్లవుతుందని చెప్పొచ్చు. అమిత్ షా మాటలు ఏపీ సీఎం చంద్రబాబుకు మరింత ఆత్మస్థైర్యాన్ని పెంచుతాయనటంలో సందేహం లేదు.
Tags:    

Similar News