లాల్ చౌక్ లో షా జెండా ఎగురవేయటం పెద్ద ట్రాష్..!?

Update: 2019-08-15 05:06 GMT
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకూ జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు.. ఈ ఏడాది జరుగుతున్న వేడుకలకు మధ్య పెద్ద తేడా ఉంది. ఇంతకాలం జమ్ముకశ్మీర్ రాష్ట్రం భారత్ లో ప్రత్యేకంగా ఉండగా.. ఇటీవల మోడీ సర్కారు తీసుకున్న చర్యల కారణంగా జమ్ముకశ్మీర్.. దేశంలోని మిగిలిన రాష్ట్రాల మాదిరి.. కేంద్రపాలిత ప్రాంతంగా మారిపోవటం తెలిసిందే. ఈ మార్పు చోటు చేసుకున్న తర్వాత వచ్చిన తొలి స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటుంది నేడే.

ఈ నేపథ్యంలో కశ్మీర్ వ్యాలీలో పెద్ద ఎత్తున భద్రతా సిబ్బందిని మొహరించారు. అన్నింటికి మించిన శ్రీనగర్ లో పరిస్థితి మరింత కట్టుదిట్టం చేశారు. గడిచిన రెండు వారాలుగా (దగ్గర దగ్గరగా) ఆంక్షల నడుమ బతుకుతున్న కశ్మీరీ వాసులు.. ఈ రోజు బయటకు వచ్చే విషయంలోనూ భద్రతాసిబ్బంది ఆంక్షలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన పరిస్థితి. ఇదిలా ఉంటే.. శ్రీనగర్ లో అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో ఒకటిగా చెప్పే లాల్ చౌక్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జెండా ఎగురవేయనున్నట్లుగా వస్తున్న వార్తలన్ని ఫేక్ న్యూస్ గా చెప్పాలి. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి మీడియా సంస్థ ఈ వార్తను వండి వార్చింది.

1992లో అప్పటి తీవ్రవాదుల హెచ్చరికల్ని పట్టించుకోకుండా లాల్ చౌక్ లో బీజేపీ నేతగా ఉన్న నేటి ప్రధాని నరేంద్ర మోడీ జెండాను ఎగురవేసిన వైనం పెద్ద సంచలనంగా మారింది. లాల్ చౌక్ లో జెండా ఎగురవేస్తే బాంబులు పేలుస్తామన్న తీవ్రవాదుల హెచ్చరికల్ని ఖాతరు చేయకుండా మోడీ జెండాను ఎగురవేశారు. మోడీ జెండా ఎగురవేసి.. జాతీయ గీతాన్ని ఆలపించే సమయంలో సమీపంలో ఐదు బాంబులు పేలాయి. అయినా వెనక్కి తగ్గకుండా జాతీయ గీతాలాపన పూర్తి చేశాకే కశ్మీర్ ను వదిలివెళ్లారు. ఈ ఉదంతం అప్పట్లో పెను సంచలనంగా మారింది.

తాజాగా జమ్ముకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మారుస్తూ తీసుకున్న మోడీ సర్కారు నిర్ణయం నేపథ్యంలో ఆగస్టు 15న లాల్ చౌక్ లో కేంద్ర హోం మంత్రిగా వ్యవహరిస్తున్న మోడీ శిష్యుడు అమిత్ షా జెండా ఎగురవేస్తారన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. అయితే.. అదంతా ఉత్తదేనని చెప్పక తప్పదు. ఇప్పటికే తీవ్ర భావోద్వేగంలో ఉన్న కశ్మీరీ వ్యాలీ ప్రజలకు.. అమిత్ షా జెండా ఎగురవేయటాన్ని తమను రెచ్చగొట్టినట్లుగా భావించే ప్రమాదం ఉంది.

ఇప్పటికే ప్రత్యేక భద్రతా దళాల పహరాలో శాంతిభద్రతల్ని పరిరక్షిస్తున్న నేపథ్యంలో.. రెచ్చగొట్టినట్లుగా మారే ప్రమాదం ఉన్న నేపథ్యంలో లాల్ చౌక్ దగ్గర అమిత్ షా జెండా వందన కార్యక్రమం ఏదీ లేదన్న విషయాన్ని ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఖండించారు. అదో వదంతి మాత్రమేనని.. అందులో ఎలాంటి నిజం లేదని.. హోం మంత్రికి అలాంటి ఆలోచనలు ఏమీ లేవని ఆయన చెప్పారు. లాల్ చౌక్ లో అమిత్ షా జెండా ఎగురవేస్తారన్నది ఉత్తమాటగా ఆయన కొట్టిపారేశారు. అది లాల్ చౌక్ కాదు.. లాల్ బాగ్.. శ్రీనగర్ లో దానికో గుర్తింపు ఉంది. అంత మాత్రాన జెండా ఎగురవేసి.. అక్కడ రాజకీయ ప్రకటనలు చేయమని ఆయన స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే.. మరో ఆసక్తికర వార్త ఒకటి వైరల్ అవుతోంది. శ్రీనగర్ లోని లాల్ చౌక్ వద్ద జాతీయ జెండాను ఎగురవేసేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 35 మంది యువకులు బయలుదేరి వెళ్లారని.. వారు లాల్ చౌక్ వద్ద జెండా ఎగురవేయాలని పట్టుదలతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజం ఎంతవరకన్నది చూడాల్సిందే. ప్రస్తుతం అమలు చేస్తున్న ఆంక్షల నేపథ్యంలో లాల్ చౌక్ మొత్తం ప్రత్యేక భద్రతా సిబ్బంది అధీనంలో ఉన్న వేళ.. జాతీయ జెండాను ఎగురవేసే అవకాశం లేదన్న మాట వినిపిస్తోంది.


Tags:    

Similar News