ఏపీ బీజేపీకి అమిత్ షా షాకింగ్ మాట

Update: 2016-07-09 06:13 GMT
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఆంధ్రప్రదేశ్‌ కోర్‌ కమిటీ సమావేశం ఆస‌క్తిక‌రంగా సాగింది. దాదాపు మూడు గంటల సేపు సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో పార్టీ బలోపేతం - సభ్యత్వం తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో బిజెపిని పటిష్టపరచడానికి ఫిరాయింపులను ప్రోత్సహించాలని సంకేతాలిచ్చారు. ఈ సంద‌ర్భంగా షా ఆస‌క్తిక‌రంగా మాట్లాడారు.  ''రాష్ట్రంలో ఏ పార్టీ నాయకులు వస్తామన్న వద్దనకండి. చేర్చుకోండి. చివరికి టీడీపీ వాళ్లనైనా వదలవద్దు. పార్టీ తలుపులు బార్లా తెరవండి. బీజేపీని బలోపేతం చేయ్యండి'' అని  రాష్ట్ర నేతలకు షా సూచించారు.

పార్టీలో చేరిక‌ల గురించి షా మాట్లాడుతూ బీజేపీలో ''ఎవరు చేరుతామని వస్తున్నా... అడ్డుకోవద్దు. అందరిని చేర్చుకోండి''అని ఆదేశించారు. దీంతో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కలుగజేసుకొని, 'టీడీపీతో మిత్ర పక్షంగా ఉన్నాం. కనుక ఆ పార్టీకి చెందిన నాయకులను చేర్చుకోవడం మంచిది కాదు' అంటూ చెప్పేలోపే...అమిత్‌ షా జోక్యం చేసుకొని, టీడీపీ వాళ్లనైనా వదలొద్దని నిర్దేశించారు. ఇదిలాఉండ‌గా రాష్ట్రంలో దేవాలయాల కూల్చివేత సందర్భంలో సరిగా స్పందించలేదని పార్టీ నేత‌ల‌పై షా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాదిలో ఆంధ్రప్రదేశ్‌ లో పార్టీకి సంబంధించి నాలుగు కీలక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. కడపలో బహిరంగ సభ - వైజాగ్‌ లో మండల స్థాయి పదాధికారుల సమావేశం - పశ్చిమ గోదావరిలో రైతు సదస్సులకు అమిత్‌ షా హాజరుకానున్నారు.
Tags:    

Similar News