దళితబంధును వదులుకున్న సిసలైన శ్రీమాంతులు

Update: 2021-09-23 09:31 GMT
వీళ్లు నిజమైన శ్రీమంతులు.. ప్రభుత్వ పథకాలను అన్నీ ఉన్నా అనుభవిస్తున్న ఈ రోజుల్లో వీరు మాత్రం వదులుకొని ఆదర్శంగా నిలిచారు. లక్ష కాదు.. రెండు లక్షలు కాదు.. ఏకంగా రూ.10లక్షలు తిరిగి ఇచ్చేయాలన్న నియమేమీ లేకున్నా సరే.. వారు ఆ డబ్బును తిరస్కరించి గొప్ప మనసు చాటుకున్నారు.

తాము మంచి స్థితిలో ఉన్నామని.. దళితబంధు కింద వచ్చే ఆ డబ్బు పేద సోదరులకు ఉపయోగపడాలంటూ ఆ ఐదుగురు పెద్ద మనసు చాటుకున్నారు. సమాజంలో సిసలైన శ్రీమంతులు అనిపించుకున్నారు. తాము ఆర్థికంగా ఉన్నత స్థితిలోనే ఉన్నామని.. తమకు రూ.10లక్షల సాయం అవసరం లేదని స్పష్టం చేశారు.

‘గివ్ ఇట్ అప్’ కింద వీరు తమకు వచ్చే ఆర్థికసాయాన్ని వదులుకొని సమాజానికి ఆదర్శంగా నిలిచారు.ఇప్పుడు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ ఐదుగురి గురించే చర్చించుకుంటున్నారు. వీరిలో ముగ్గురు వ్యక్తులు తండ్రీకొడుకులు కావడం మరింత విశేషం.

ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన దళితుల పురోభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా సర్వే చేసి 5 మండలాల్లో దాదాపు 23వేలకు పైగా దళితులను గుర్తించింది. వీరికోసం రూ.2000 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటివరకు హుజూరాబాద్ నియోజకవర్గంలో 14421 మంది లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం దళితబంధు నిధులు జమచేసింది. తాజాగా ఐదుగురు వ్యక్తులు తమకు ‘దళితబంధు’ సాయం వద్దని వదులుకోవడం సంచలనమైంది.

దళితబంధును వదులుకున్న వారిలో రిటైర్డ్ హెడ్ మాస్టర్ కర్రె నరసింహస్వామి ఉన్నారు. ఆయన భార్య కూడా ప్రభుత్వ టీచర్ గా రిటైర్ అయ్యారు. పేదకుటుంబాలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఈ రూ10లక్షలు వదులుకుంటున్నట్టు వివరించాడు.

ఇక రైల్వే ఇంజనీర్ కర్రె కిరణ్ కుమార్, రిటైర్డ్ ఇంజనీర్ సోటాల మోహన్ రావు, లు కూడా పేదల కోసం ఈ రూ.10లక్షలు వదులుకుంటున్నట్టు ప్రకటించి ఆదర్శంగా నిలిచారు.




Tags:    

Similar News