విమానాలు బంద్‌.. అంత‌ర్జాతీయ విమానాల‌పై ప్ర‌భావం

Update: 2019-02-27 09:19 GMT
తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో భార‌త్ - పాక్ మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. చాలా రోజుల త‌ర్వాత ఉద్రిక్త‌త‌లు పీక్స్ కు వెళ్ల‌ట‌మే కాదు.. యుద్ధ మేఘాలు రెండు దేశాల మ‌ధ్య క‌మ్ముకుంటున్న సంకేతాలు క‌నిపిస్తున్నాయి. దీనికి త‌గ్గ‌ట్లే స‌రిహ‌ద్దు న‌గ‌రాలపై వార్ ప్ర‌భావం ప‌డిన‌ట్లుగా క‌నిపిస్తోంది.

భార‌త్‌-పాక్ గ‌గ‌న‌త‌లంపై ప్ర‌యాణించాల్సిన విమానాల్ని వేరే మార్గంలో వెళ్లాల్సిందిగా అంత‌ర్జాతీయ విమానాల‌కు సూచ‌న‌లు అందిన‌ట్లుగా చెబుతున్నారు. ఇప్ప‌టికే వ‌చ్చేసి.. తిరుగు ప్ర‌యాణాలు చేయాల్సిన ఫ్లైట్స్ ను వేరే మార్గాల్లో రావాల్సిందిగా కోరుతున్నారు. ఇదిలా ఉంటే.. అమృత్ స‌ర్.. జ‌మ్ము.. లేహ్ తో పాటు స‌రిహ‌ద్దు ప్రాంతాల్లోని విమానాశ్ర‌యాల్లో పౌర విమాన సేవ‌ల్ని ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

అంచ‌నాల‌కు భిన్నంగా పౌర విమానాల్ని ర‌ద్దు చేయ‌టంతో ప‌లు ఎయిర్ పోర్టుల‌కు చేరిన ప్ర‌యాణికులు ఇబ్బందుల‌కు గురి అవుతున్నారు. విమాన రాక‌పోక‌ల్ని నిలిపివేస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌టంపై అమృత్ స‌ర్ విమానాశ్ర‌య డైరెక్ట‌ర్ స్పందించారు. విమాన రాక‌పోక‌ల్ని నిలిపివేయ‌టానికి కార‌ణాన్ని సూటిగా చెప్ప‌ని ఆయ‌న‌.. అత్య‌వ‌స‌ర కార‌ణాల‌తో అమృత్ స‌ర్ గ‌గ‌న‌త‌లంలో విమాన రాక‌పోక‌ల్ని నిలిపివేసిన‌ట్లుగా ప్ర‌క‌టించారు. ఎలాంటి వాణిజ్య విమానాలు అమృత్ స‌ర్ రావ‌టం లేద‌ని.. అలాగే ఎయిర్ పోర్ట్ నుంచి ఏ విమానం టేకాఫ్ తీసుకోవ‌టం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఇంత త్వ‌ర‌గా ప‌రిణామాల్లో మార్పు ఊహించ‌ని విమాన ప్ర‌యాణికులు తీవ్ర ఇబ్బందుల‌కు గురి అవుతున్నారు.
Tags:    

Similar News