రాయ‌పాటి అంత పెద్ద ప్ర‌క‌ట‌న‌.. టీడీపీలో జోషేది...!

Update: 2022-10-03 05:29 GMT
ఇదిగో పులి.. అంటే అదిగో తోక‌! అనే రాజ‌కీయాలు పెరుగుతున్నాయి. ఏ చిన్న విష‌యంపైనైనా.. రాజ‌కీయ నేత‌లు తండోప తండాలుగా విరుచుకుప‌డుతున్నారు. మీడియా ముందు మీటింగులు పెట్టి మ‌రీ.. దంచి కొడుతున్నారు. ఈ విష‌యంలో పార్టీల కు అతీతంగా అంద‌రూ దూసుకుపోతున్నారు. వైసీపీ అయినా.. టీడీపీ అయినా.. ఇదే ధోర‌ణి. నాయ‌కులు ఏ విష‌యాన్న‌యినా ... త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మ‌రి ఇలాంటి స‌మ‌యంలో ఫుల్ బూస్ట్ ఇచ్చే వార్త‌లు తెర‌మీదికి వ‌స్తే.. అస‌లు వ‌దులుతారా?  అన్న‌ది ప్ర‌శ్న‌.

ఎవ్వ‌రూ వ‌దిలి పెట్ట‌రు క‌దా! కానీ, అదేంటో టీడీపీ నేత‌లు మాత్రం ఉలుకు ప‌లుకు లేకుండా ఉన్నారు. విష‌యంలోకి వెళ్తే.. మాజీ ఎంపీ.. గుంటూరుకు చెందిన రాయ‌పాటి సాంబ‌శివ‌రావు.. తాజాగా సంచ‌ల‌న విష‌యాన్ని వెల్ల‌డించారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ తుడిచి పెట్టుకుపోతుంద‌ని, 2024 ఎన్నిక‌ల్లో టీడీపీదే ఘ‌న విజ‌య‌మ‌ని పేర్కొన్నారు. అంతేకాదు.. రాష్ట్రంలో ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే.. 125 అసెంబ్లీ స్థానాల్లో తెలుగు దేశం పార్టీ  విజ‌యం సాధిస్తుంద‌ని అన్నారు. అంతేకాదు.. ఈ విష‌యంలో ఎలాంటి సందేహం లేద‌ని మ‌రీ చెప్పుకొచ్చారు.

అంతేకాదు.. అభివృద్ధి నాయ‌కుడిగా... విజ‌న్ ఉన్న నేత‌గా.. నారా చంద్ర‌బాబు పేరు తెచ్చుకున్నార‌ని.. ఆయ‌న వైపే ప్ర‌జ‌లు చూస్తున్నార‌ని చెప్పారు. ఇలా.. కొన్నాళ్లుగా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉన్న రాయ‌పాటి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో  టీడీపీ గెలుపు పై అత్యంత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం.. సంచ‌ల‌న‌మ‌నే చెప్పాలి.

మ‌రి ఆయ‌న ఇంత‌గా ప్ర‌క‌టించిన త‌ర్వాత‌.. కూడా.. టీడీపీ లో ఎక్క‌డా జోష్ క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఒక్క‌నాయ‌కుడు అంటే.. ఒక్క నాయ‌కుడు కూడా.. ఎవ‌రూ స్పందించ‌లేదు. క‌నీసం.. రాయ‌పాటి చెప్పిన‌దాన్న‌యినా.. రిపీట్ చేయ‌లేదు.

మ‌రి..ఈ ప‌రిస్థితే కొన‌సాగితే.. టీడీపీ నేత‌లు.. రాయ‌పాటి చెప్పింది నిజం కాద‌ని అనుకున్నారా? అనే సందేహాలు ప్ర‌జ‌ల‌కు క‌లుగుతున్నాయి. అంతేకాదు.. ఎప్పుడూ.. మాకు అన్ని సీట్లు వ‌స్తాయ‌ని.. ఇన్ని సీట్లు వ‌స్తాయ‌ని ప్ర‌జ‌ల‌కు చెప్పుకొనే నాయ‌కులు ఇప్పుడు ఎక్క‌డా క‌నీసం ప‌న్నెత్తు మాట కూడా అన‌క‌పోవ‌డం.. రాయ‌పాటిని స‌మ‌ర్ధించ‌క‌పోవ‌డం కూడా.. రాజ‌కీయంగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఆయ‌న‌ను ఉద్దేశ పూర్వ‌కంగానే ప‌క్క‌న పెడుతున్నారా? ఆయ‌న‌ను స‌మ‌ర్థిస్తే.. ప్ర‌మాద‌మ‌ని భావిస్తున్నారా? అనే చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News