ఏంటి బ్రో ఇది.. రూ.1కోటి కోసం చనిపోయినట్లుగా నటించి!

Update: 2021-11-09 04:17 GMT
పైసా మే పరమాత్మ హై అంటారు. ఇక పైసల కోసం దేనకైనా సిద్ధంగా ఉంటారు కొందరు. డబ్బులు వస్తాయంటే చాలు మంచీ.. చెడూ ఏది చూడరు. ముందు వెనుక ఆలోచించకుండా పైసల కోసం ఎలాంటి తప్పు పని చేయడానికైనా వెనుకాడరు. అయితే పథకం రచించినంత ఈజీగా దానిని అమలుచేయలేరు. ఏదో ఒక దగ్గర అడ్డంగా బుక్కై ఆఖరకు తల పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అచ్చం ఇలాంటి సంఘటనే ఓ కుటుంబానికి జరిగింది. రూ.1కోటి కోసం ఆశపడిన ఆ వ్యక్తి... కుటుంబంతో సహా కటకటాల్లోకి వెళ్లాల్సి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే...

రూ.కోటి బీమా కోసం చనిపోయినట్లు నటించాడు ఓ ప్రబుద్ధుడు. కుటుంబంతో పాటు ఓ డాక్టర్ తో కలిసి ప్లాన్ చేశారు. కట్ చేస్తే కథ రివర్స్ అయింది. అనూహ్యంగా పోలీసులకు చిక్కాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దేవాస్ ప్రాంతానికి చెందిన హనీఫ్(46) ఈ ఘనకార్యానికి ఒడిగట్టారు. ఆయన 2016లో ఓ సంస్థ నుంచి రూ.1కోటి బీమా తీసుకున్నారు. అలా రెండు వాయిదాలు కట్టారు. ఇంతలోనే అతనికి ఓ ఆలోచన వచ్చింది. దానికి ఓ వృద్ధ వైద్యుడి సాయం ఆజ్యమైంది. అంతే ఇక రూ.1కోటిని ఈజీగా తీసుకోవచ్చు అనుకున్నారు. అందుకు తగిన ప్లాన్ చేశారు. ఆ డాక్టర్ సాయంతో హనీఫ్ చనిపోయినట్లు నకిలీ పత్రాలు సృష్టించారు. అతడి భార్య రెహానా, ఇక్బాల్ బీమా కంపెనీకు వెళ్లారు. రూ.1కోటి కోసం దరఖాస్తు చేశారు.

ఈ హనీఫ్ మృతి వ్యవహారంపై ఆ కంపెనీకు అనుమానం కలిగింది. ఫలితంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు అసలు విషయాన్ని బయటపెట్టారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన పోలీసులు.. హనీఫ్ బతికే ఉన్నట్లుగా తేల్చారు. పైగా వీళ్లంతా కలిసి నాటకం ఆడినట్లు గుర్తించారు. డబ్బుల కోసం మరణించినట్లు మోసం చేసిన ఈ కుటుంబాన్ని, వైద్యుడిని పోలీసులు అరెస్టు చేశారు.

ఈ కేసులో భాగంగా చనిపోయినట్లు నకిలీ ధ్రువపత్రం సృష్టించిన హనీఫ్, అతడి భార్య రెహానా, కుమారుడు ఇక్బాల్, వీరికి సహకరించిన వైద్యుడిపై పోలీసులు చర్యలు చేపట్టారు. నవంబర్ 7న నిందితులను ఫోర్జరీ కేసు కింద అరెస్ట్ చేసినట్లు దేవాస్ పోలీసులు వెల్లడించారు. ఇక నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించిన వైద్యుడిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అతడి డిగ్రీ పట్టాపైన విచారణ జరుపుతామని పేర్కొన్నారు.

రూ.1కోటి బీమా కోసం ఏకంగా చనిపోయినట్లు నకిలీ ధ్రవపత్రాన్ని తీసుకున్న ఈ వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. పైసల కోసం చనిపోయినట్లుగా ఎందుకు నటించాలి బ్రదర్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. బీమా అవసరానికి వాడుకోవాలి కానీ ఇలా దుర్వినియోగం చేయడం ఏంటి? బ్రో అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా బీమా డబ్బుల కోసం కుటుంబసభ్యులు, వైద్యుడు కలిసి ఇలా చేయడం మంచి పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. ఫలితంగా ఇంటిల్లిపాది కటకటాలకు వెళ్లాల్సి వచ్చిందని అంటున్నారు.




Tags:    

Similar News