వీహెచ్ తో సీవీ ఆనంద్ సరదా సంభాషణ విన్నారా?

Update: 2022-02-22 04:30 GMT
ఆయనో సీనియర్ నేత. తనను బద్నాం చేయటానికి సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేసిన ఫోటోలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడానికి ఠాణాకు వచ్చారు. కట్ చేస్తే.. అదే సమయంలో అక్కడికి వచ్చారు హైదరాబాద్ సీపీ. అలాంటి వేళ.. ఆ ఇద్దరి మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందన్నది చూస్తే.. నవ్వులు విరబూయాల్సిందే.

రోటీన్ కు భిన్నంగా సాగిన ఈ సంభాషణ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఇంతకీ ఆ సీనియర్ నేత మరెవరో కాదు.. వీహెచ్ హనుమంతరావు. సీరియస్ గా కంప్లైంట్ ఇవ్వటానికి వచ్చిన ఆయన్ను కూల్ చేయటమే కాదు.. తన మాటలతో వాతావరణం మొత్తాన్ని తనదైన శైలిలో మార్చిన ఈ ఉదంతం రోటీన్ కు భిన్నంగా సాగిందని చెప్పక తప్పదు.

‘పల్స్ ఆఫ్ తెలంగాణ’ పేరుతో వాట్సాప్ తో పాటు సోషల్ మీడియాలో తాను టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు.. జగ్గారెడ్డితో కలిసి సీఎం కేసీఆర్ తో ఉన్నట్లుగా తన ఫోటోను మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. హైదరాబాద్ సైబర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఇక్కడో విషయాన్ని ప్రస్తావించాలి.

ఇదే అంశం మీద రెండు రోజుల క్రితం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వీహెచ్ వెళ్లటం.. అక్కడ కంప్లైంట్ ఇచ్చే వేళ.. పోలీసు అధికారితో వాగ్వాదం జరగటం.. దానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ఇలాంటి వేళ.. హైదరాబాద్ సీసీఎస్ కు వెళ్లిన వీహెచ్ కు.. అప్పుడే అక్కడకు వచ్చిన హైదరాబాద్ సీపీకి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ‘‘డ్రగ్స్ పై తీసుకుంటున్న చర్యలు చరిత్రాత్మకం.. యూత్ మత్తుకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. నేను ప్రతి ఏడాది నిర్వహించే జాతీయ స్థాయి క్రికెట్ పోటీలను ఈ నెల 24న హాజరై ప్రారంభించాలని వీహెచ్ అంటే.. దానికి బదులు ఇచ్చిన సీపీ ఆనంద్.. ‘‘వస్తాను కానీ ఇంతకీ ఎవరి మీద కంప్లైంట్ చేయటానికి వచ్చారు? నా పైనా.. నేనేమైనా చేశానా? లేదంటే మా వాళ్లు ఏమైనా చేశారా? అని అనునయంగా మాట్లాడిన తీరుతో అక్కడంతా నవ్వులు విరబూసాయి.

సీవీ ఆనంద్ మాటలకు స్పందించిన వీహెచ్.. ‘‘ఎవరో గిట్టనివారు నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ లో చేరినట్లు.. కండువా వేసుకుంటున్నట్లుగా ఫోటోను మార్ఫింగ్ చేశారని చెప్పగా.. సీపీ స్పందిస్తూ.. ‘మార్ఫింగ్ కేసా.. దీన్ని సీరియస్ గా తీసుకుంటాం.

ఇంతకీ వారు రాసిన వ్యాఖ్యల్లో ఏమైనా నిజముందా? మీ మనసులో అలాంటి ఆలోచన ఉందా? అన్న ప్రశ్నకు వీహెచ్ రియాక్టు అవుతూ.. ‘మా పార్టీలోనే డేంజర్ ఉంది. మాలోనే ప్రతిపక్షం ఉంది’ అని బదులివ్వడం గమనార్హం.

దీనికి బదులిచ్చిన సీపీ.. ‘అది అందరికీ తెలిసిందే కదా. మీకు మరో ప్రతిపక్షమే అక్కర్లేదు’ అంటూ చేసిన వ్యాఖ్యకు అక్కడి వారంతా పెద్ద ఎత్తున నవ్వారు. హాట్ హాట్ గా ఉంటుందనే వాతావరణాన్ని కూల్ గా మార్చేయటమే కాదు.. సీపీ ఆనంద్ చేసిన వ్యాఖ్యలు రోటీన్ కు భిన్నంగా ఉన్నాయని చెప్పక తప్పదు.
Tags:    

Similar News