జగన్ ను చూసి కాదు.. వైఎస్ ఫొటో చూసి ఓటేశాం!!

Update: 2020-09-18 16:43 GMT
వైసీపీలో అసంతృప్తి జ్వాల ఎగిసిపడింది.. ఇన్నాళ్లు గూడు కట్టుకొని ఉన్నదంతా వైసీపీలోని క్షేత్రస్థాయి నాయకులు కక్కేశారు. తాజాగా అనంతపురంలో వైసీపీ నాయకులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రోడ్లు , భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణపై జిల్లాలోని గోరంట్ల మండల వైసీపీ నాయకులు మండిపడ్డారు. అభివృద్ధి పనులకు మంత్రి సోదరుడు మల్లికార్జున్ అడ్డుపడుతున్నారంటూ విమర్శించారు. మల్లికార్జున్ పై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. జగన్ ను చూసి కాదు.. వైఎస్ ఫొటో చూసి ఓటేశామని.. ఇప్పుడు వైసీపీని నమ్ముకున్న వారికి అన్యాయం చేస్తున్నారని వైసీపీ నేత, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు గంపల రమణారెడ్డి ఆక్రోశం వెల్లగక్కారు.

తమపై ఐదు కోట్ల రూపాయలకు మంత్రి సోదరుడు మల్లికార్జున్ దావా వేశాడని.. గోరంట్లలో చేసిన వసూళ్లు సరిపోవడం లేదని.. ఈ రూపంలో కూడా తమపై వసూళ్లకు పాల్పడుతున్నారని వైసీపీ నేత రమణారెడ్డి విమర్శలు గుప్పించారు.

తమకు పంపిన నోటీసును వెనక్కి తీసుకోకపోతే ధర్మవరంలోని మంత్రి ఇంటికి పాదయాత్ర చేపడుతామని హెచ్చరించారు.

తాము శంకర్ నారాయణను , వైఎస్ జగన్ ను చూసి ఓటు వేయలేదని.. రాజశేఖర్ రెడ్డి ఫొటో చూసి మాత్రమే ఓట్లు వేశామని వైసీపీ నేత ఆరోపించారు. దావా బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.
Tags:    

Similar News