బాబు సవాలుకు సై అంటున్నాడు

Update: 2015-11-09 15:57 GMT
కర్నూలు పర్యటన సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విపక్షాలపై స్వరం పెంచిన సంగతి తెలిసిందే. తన దృష్టి రాజధాని ప్రాంతం మీదనే తప్పించి.. రాయలసీమ మీద లేదంటూ చేస్తున్న విమర్శలపై స్పందించారు. రాయలసీమను పట్టించుకోవటం లేదంటూ చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదన్నట్లుగా చంద్రబాబు సవాలు విసిరారు. అన్నీ ప్రాంతాల్ని సమానంగా చూస్తున్నట్లు చెప్పుకున్న ఆయన.. తన హయాంలో రాయలసీమకు అన్యాయం జరిగిందని భావించే వారు బహిరంగ చర్చకు రావాలంటూ సవాలు విసిరారు.

ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నేరుగా సవాలు విసిరితే అంతకు మించి ఏం కావాలి. చంద్రబాబు విసిరిన సవాలు మీద స్పందనలు మొదలయ్యాయి. మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి స్పందిస్తూ.. బాబు సవాలును స్వీకరిస్తున్నానని.. చర్చకు ఎక్కడికైనా వస్తానని ప్రకటించారు.

బాబు హయాంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందని నిరూపించేందుకు తాను సిద్ధమని చెప్పారు. బాబు విధానాలు.. రాయలసీమ ఉనికికే ప్రమాదకరంగా మారాయన్నారు. పవర్ లోకి వచ్చిన తర్వాత పాతిక సార్లు సీమలో పర్యటించినా.. ఏమీ చేయలేదని మండిపడ్డారు. సీమకు జరుగుతున్న అన్యాయం మీద ఏపీ అధికారపక్షంలోని మంత్రులు.. ఎమ్మెల్యేలు ఎవరూ పెదవి విప్పటం లేదన్నారు. మరి.. సవాలు విసిరిన చంద్రబాబుకు ప్రతి సవాలు విసిరిన అనంత వెంట్రామిరెడ్డికి ఏం సమాధానం ఇస్తారో..?
Tags:    

Similar News