సమస్యల పరిష్కారమే సంక్షోభానికి పరిష్కారం!

Update: 2015-06-26 17:30 GMT
సెక్షన్‌ 8.. తొమ్మిది, పదో షెడ్యూలులోని సంస్థలు.. విద్యుత్తు ఉద్యోగులు.. ఉద్యోగుల విభజన.. కాంట్రాక్టు ఉద్యోగులు.. తెలంగాణలో ఒకదాని తర్వాత మరొకటిగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య సమస్యలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. ఒకటి పరిష్కారం కాకుండా మరొకటి వస్తోంది. ఇక్కడ ఒక దానిలో తెలంగాణది తప్పయితే మరొక దానిలో ఏపీది తప్పు ఉంటోందని నిపుణులు చెబుతున్నారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ముందుకు రాకుండా రెండు ప్రభుత్వాలూ.. రెండు రాష్ట్రాల నాయకులు సమస్యలను పెంచుకుంటున్నారని కూడా వివరిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ను రెండు ముక్కలు చేసి ఏడాది దాటింది. అప్పట్లోనే కాంగ్రెస్‌ పార్టీ ఎటువంటి ముందు జాగ్రత్తలూ తీసుకోకుండా, భవిష్యత్తులో వచ్చే సమస్యలను ఆలోచించకుండా.. సమస్యలకు పరిష్కారాలు చూపకుండా హడావుడిగా విభజన చేసేసింది. దాంతోనే ఇప్పుడు రెండు రాష్ట్రాలూ కొట్టుకోవాల్సి వస్తోంది. పోనీ, రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల నాయకత్వాలూ కనీసం ఒక్కసారి అయినా కూర్చుని.. మాట్లాడుకుని.. సమస్యలను పరిష్కరించుకున్నాయా అంటే అదీ లేదు. ఎవరికి వారే రాజకీయంగా పైచేయి సాధించడానికి ఎత్తులు పైయెత్తులు వేసుకుంటున్నారు. తప్పితే ఉద్యోగులు, ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదు.

ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇరు రాష్ట్రాల అధికారులు రెండు రోజులపాటు ఒకచోట కూర్చుని చర్చించుకుంటే తొమ్మిది, పది షెడ్యూలులోని సంస్థల విభజన ఎంతసేపు పడుతుంది? విద్యుత్తు ఉద్యోగుల సమస్యను పరిష్కరించడానికి ఎంత సమయం పడుతుంది? ఉద్యోగుల విభజనను ఇరువురూ కలిసి ఎంతసేపట్లో తేల్చేయగలుగుతారు? ఇవి మాత్రమే కాదు.. రెండు రాష్ట్రాల మధ్య పీటముడి పడిపోయిన అన్ని సమస్యలూ ఒక్కరోజులో పరిష్కారమవుతాయి. కానీ, వాటిని పరిష్కరించాలనే చిత్తశుద్ధి ఇరు రాష్ట్రాల్లోని నాయకులతోపాటు గవర్నర్‌ నరసింహన్‌కు కూడా లేదని, అందుకే రెండు రాష్ట్రాల ప్రజలూ ఇబ్బందులు పడాల్సి వస్తోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News