కేసీఆర్ కోరిక తీరిన‌ట్టేనా!

Update: 2018-08-24 05:20 GMT
సమైక్య రాష్ట్రంలో మిగిలిన ఏకైక పెద్ద ప్రభుత్వ కార్యాలయం ఇక విడిపోనుంది. తెలంగాణ ప్రభుత్వం పట్టుపడుతున్న ఉమ్మడి హైకోర్టు త్వరలో రెండుగా చీలిపోతోంది. అంటే ఇక సమైక్య న్యాయం రెండు ముక్కలవుతోందన్నమాట. హైకోర్టును  విభజించాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇటీవల కాలంలో  పలుమార్లు గవర్నర్ నరసింహన్‌ ను కలిసి హైకోర్టు విభజనపై కేంద్రంతో మాట్లాడాలంటూ కోరారు. ఆయన ప్రయత్నాలు చివరికి ఫలించి నూతన సంవత్పరంలో హైకోర్టు రెండుగా చీలిపోయేందుకు రంగం సిద్ధం అయ్యింది. ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా వచ్చే అవకాశం ఉంది.

 ఉమ్మడి హైకోర్టు కారణంగా తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పడుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు - ఆయన మంత్రివర్గ సహచరులు భావిస్తున్నారు. ఇటీవల ఉమ్మడి హైకోర్టు పలు సందర్భాల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పు పట్టింది. ఇక్కడ జరుగుతున్న పలు ప్రాజెక్టులపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కోర్టును ఆశ్రయించడం - అక్కడ తెలంగాణ ప్రభుత్వానకి వ్యతిరేకంగా తీర్పులు - స్టేలు రావడం తెలంగాణ ప్రభుత్వ అధినేతకు కిట్టడం లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఉమ్మడి హైకోర్టు కల్వకుంట్ల వారికి కంటిలో నలుసులా మారింది. దీంతో ఆయన ఎలాగైనా హైకోర్టును విభజించాలని తీవ్ర ప్రయత్నాలు చేశారు.

ఇందుకోసం ఢిల్లీలో లాబీయింగ్ కూడా నెరపారు. ఇవన్నీ ఫలించి మొత్తానికి ఉమ్మడి హైకోర్టు రెండుగా చీలిపోయేందుకు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ పార్టీ చెందన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి - సంపత్ కుమార్‌ లపై శాసనసభ సభ్యత్వ రద్దు నిర్ణయంపై ఉమ్మడి హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని చాలా సార్లు మందలించింది. ఒకవిధంగా ఈ కేసులో ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింది. వీరిద్దరి విషయంలో కాంగ్రెస్ అంత సీరియస్ గా తీసుకోలేదు కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి కలిసి వచ్చింది. లేకుంటే ఉమ్మడి హైకోర్టు వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మరింత ఇరుకున పడే వారు. ఇప్పుడు తనకు అనుకూలంగా నిర్ణయం రావడంతో ఆయన కోరిక తీరినట్లు అయ్యింది. ఎన్నికల వేళ ఇది తెలంగాణ రాష్ట్ర సమితికి శుభ పరిణామమే.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో హైకోర్టు కోసం భవనం సిద్ధం చేస్తున్నారు. హైకోర్టు విభజన కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అన్ని ప్రయత్నాలు చేసినా దాన్ని నిలువరించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలాంటి  ప్రయత్నాలు చేయకపోవడంపై న్యాయవాదులు - సిబ్బందిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మరో ఐదేళ్ల పాటు హైదరాబాద్ లో ఉండే అవకాశం ఉన్నా దాన్ని వాడుకోకుండా మిన్నకున్నారనే విమర్శ చంద్రబాబు నాయుడిపై వస్తోంది. రానున్న ఎన్నికల్లో ఆయనకు ఇది ఎదురుదెబ్బగానే కనిపిస్తోంది.
Tags:    

Similar News