‘‘ఉప్పు అమ్మాం’’ మాటల అర్థమేంది మోడీ?

Update: 2016-09-11 04:28 GMT
ఏపీకి ప్యాకేజీ - ఆ త‌ద‌నంత‌ర ప‌రిణామాల‌పై ప్ర‌ధాన‌మంత్రి  న‌రేంద్ర‌మోడీ త‌న మ‌న‌సులోని మాట‌ను వెల్ల‌డించారు. అయితే ఈ విష‌యాన్ని మీడియాతో కాకుండా ఏపీకి చెందిన సొంత పార్టీ నేత‌ల వ‌ద్ద మోడీ ప్ర‌స్తావించారు. ఏపీకి ప్యాకేజీ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఆ పార్టీ రాష్ట్ర నేత‌లు ఢిల్లీకి వెళ్లి ప్ర‌ధాన‌మంత్రికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ - బీజేపీ అధ్యక్షుడు - ఎంపీ కంభంపాటి హరిబాబు త‌న‌తో స‌మావేశం అయిన సంద‌ర్భంగా ప్రధాని మోడీ వారితో దాదాపు గంట పాటు మ‌న‌సు విప్పి మాట్లాడిన‌ట్లు స‌మాచారం. త‌న సొంత రాష్ట్రమైన గుజ‌రాత్‌ తో పోల్చిచూపుతూ ఏపీ చాలా మెరుగ్గా ఉంద‌ని మోడీ చెప్పార‌ని తెలుస్తోంది.

సార్వత్రిక ఎన్నికలయ్యాక.. బంపర్ మెజార్టీతో ప్రధాని కుర్చీలో కూర్చున్న తర్వాత మోడీ నోటి నుంచి బహిరంగంగా ఏపీ విభజన గురించి మాటలుఏమైనా వచ్చాయా? ఏపీ కమలనాథుల్ని కూర్చోబెట్టుకొని తమ రాష్ట్రం (గుజరాత్)మహారాష్ట్ర నుంచి విడిపోయిన తొలినాళ్లలో ఎదుర్కొన్న పరిస్థితుల్నిమోడీ ప్రస్తావించటం గమనార్హం. నాటి కష్టాల్ని గుర్తు చేసుకుంటూ.. మాకష్టాల ముందు మీ కష్టాలు ఏ పాటివి అన్నట్లుగా చెప్పిన మాటల్నిచూస్తేనే.. ఏపీ విషయంలో మోడీ మైండ్ సెట్ ఎలా ఉందన్నది ఇట్టే అర్థంకాక మానదు. ఏపీకి మోడీ సర్కారు ప్రకటించిన ప్యాకేజీ గురించి ఏపీ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వేళ.. ప్రజల వైఖరికి భిన్నంగా ఏపీ బీజేపీ నేతలు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన తీరు చూస్తే సీమాంద్రుడికి చిరాకు పుట్టించేదే. ఈ విషయాన్ని పక్కన పెడితే.. ఏపీ బీజేపీ నేతలతో భేటీ అయిన ప్రధాని మాటల్ని జాగ్రత్తగా చూసినప్పుడు.. ఇప్పటి రోజున ఏపీ ఎదుర్కొంటున్న విభజన కష్టాలు పెద్దవేం కాదన్నట్లుగా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మహారాష్ట్ర నుంచి గుజరాత్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని.. ఉప్పు అమ్ముకొని నెట్టుకు రావాల్సి వచ్చిందని.. ఏపీకి అలాంటి పరిస్థితి రానివ్వమంటూ మోడీ వ్యాఖ్యానించటం చూస్తే ఏపీకేం బాగానే ఉంది కదా అన్న మాట ఆయన మాటల్లో కనిపిస్తుంది. ఈ అభిప్రాయానికి బలం చేకూరేలా ఆయన తర్వాతి మాటలు ఉండటాన్ని మర్చిపోకూడదు.

ఏపీ బీజేపీ నేతలతో మోడీ భేటీ వివరాల్ని వెల్లడించిన సిద్ధార్థ నాథ్ మాటల్ని చూసినప్పుడు.. ‘‘విభజన తర్వాత ఉప్పు అమ్ముకొని గుజరాత్ రాష్ట్రాన్ని నడిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితి ఏపీలో లేదు. వనరులు పుష్కలంగా ఉన్నాయి. ఏపీని అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రత్యేక ప్యాకేజీ రూపంలోభారీగా నిధులు అందిస్తున్నాం’’ అంటూ చెప్పిన మాటలు వింటే ఏపీ విషయంలో మోడీ మైండ్ సెట్ ఏమిటన్నది ఇట్టే అర్థమవుతుంది. మోడీ మాటల్ని స్కూల్లో స్టూడెంట్ తరహాలో బుద్దిగా విన్న ఏపీ బీజేపీ నేతల బుర్రల్లో ఒక్క సందేహం కూడా వచ్చినట్లుగా లేదు. నాడు గుజరాత్ కొత్త రాష్ట్రంగా మహారాష్ట్ర నుంచి విడిపోవాలనుకొని విడిపోయి కష్టాలు పడింది. తనకేమాత్రం ఇష్టం లేని విభజనకు గురై ఏపీ ఎందుకు కష్టాలు పడాలి? ఏపీ విభజన కష్టాలకు గుజరాత్ విభజన కష్టాలకు సంబంధం ఏమైనా ఉందా? వాళ్లు ఎవరో ఉప్పు అమ్ముకొని బతికిన తీరుతో పోల్చుకుంటూ సీమాంధ్రులు సుఖంగానే ఉన్నారని చెప్పటం చూస్తే.. మోడీ లాంటోళ్లకు ఏపీ మీద ఉన్న అభిమానం ఎంతన్నది ఇట్టే అర్థం కాక మానదు.
Tags:    

Similar News