పవన్ ను హైదరాబాద్ వదిలి రమ్మంటున్నారు

Update: 2016-09-13 06:04 GMT
తమపై ఫైరింగ్ మొదలెట్టిన జనసేన అధినేత  పవన్ కల్యాణ్ పై రివర్స్ గేర్ లో విమర్శల్ని షురూ చేశారు ఏపీ కమలనాథులు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ గళం విప్పిన పవన్ కల్యాణ్.. రెండు బహిరంగ సభల్ని ఏర్పాటు చేసి బీజేపీ నేతల్ని కడిగిపారేసిన వైనం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ పై విమర్శలు సంధించేందుకు కొత్త అస్త్రశస్త్రాల్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఒక సూటి ప్రశ్నను పవన్ పై సంధించారు.

పవన్ కల్యాన్ ఆంధ్రా వాదా? సమైక్యవాదా? తెలంగాణ వాదా? అన్న విషయాన్ని తేల్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఏపీ కమలనాథులు. ఒకవేళ పవన్ కల్యాణ్ కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కోరుకునే వాడైతే హైదరాబాద్ నుంచి తరలి రావాలని. విశాఖపట్నంలో సినీ పరిశ్రమను పెట్టటానికి ముందుకు వస్తారా? అంటూ సవాల్ విసురుతున్నారు ఏపీ బీజేపీ నేతలు.

రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీపై పవన్ కల్యాణ్ అవగాహన పెంచుకొని మాట్లాడితే బాగుంటుందన్న బీజేపీ నేతలు.. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిపై చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీ పట్ల తనకున్న కమిట్ మెంట్ నుప్రదర్శించాలని కోరుతున్న ఏపీ బీజేపీ నేతలు.. తొలుత ఆ పనిని చేయాల్సింది వారేనన్న విషయాన్ని గుర్తిస్తే మంచిది.

విభజన సయంలో ఊరంతా ఒక దారి అయితే.. ఉలిపికట్టది మరో దారి అన్నట్లుగా సమైక్య ఉద్యమం భారీ ఎత్తున సాగుతున్న వేళ.. బీజేపీ అధినాయకత్వం డిసైడ్ చేసిన విభజనకు వత్తాసు పలికి ఏపీ బీజేపీ నేతలు.. ఏపీ ప్రజల కంటే పార్టీకే విధేయులన్న విషయం తెలియంది కాదు. అలాంటి వారు ఈ రోజున పవన్ ను ఇరుకున పెట్టేందుకే భావోద్వేగపు మాటలు మాట్లాడటాన్ని గుర్తించొచ్చు. ఏపీ ప్రయోజనలే తమకు ప్రధానమని ఏపీ బీజేపీ నేతలు నిజంగా ఫీల్ అయితే.. ప్రత్యేక హోదా వరకూ ఎందుకు విశాఖకు రైల్వే డివిజన్ ను వారం వ్యవధిలో తీసుకురాగలరా? ఒకరి కమిట్ మెంట్ ఎంతన్నది నిగ్గు తేల్చే ముందే తమ కమిట్ మెంట్ ఏమిటన్నది ఏపీ బీజేపీ నేతలు ఆత్మశోధన చేసుకుంటే మంచిది.
Tags:    

Similar News