ఏపీ బీజేపీకి ఎక్కువైందట

Update: 2015-10-19 07:58 GMT
రాజధాని శంకుస్థాపన కార్యక్రమాల్లో బిజెపి నేతలు అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతున్నా వారెవరూ ఇంత వరకూ ఏర్పాట్లలో పాలుపంచుకున్న దాఖలాలులేవు. టిడిపి నేతలు కూడా బిజెపి నేతలను కలుపుకొని పోవడం లేదనే వాదన వినిపిస్తోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ఇటీవల పలుమార్లు విజయవాడ - గుంటూరు ప్రాంతాల్లో పర్యటించినా శంకుస్థాపన ప్రాంగణం వైపు కన్నెత్తి చూడలేదు. మంత్రి కామినేని శ్రీనివాస్‌ మాత్రమే ఆదివారం సభాస్థలి వద్దకు వచ్చి వేదికను పరిశీలించి వెళ్లారు. మరో మంత్రి అయ్యన్నపాత్రుడితో కలిసి ఆయన ఇతర పార్టీల నేతలకు ఆహ్వానాలు అందిస్తూ యాక్టివ్ గానే ఉన్నారు. రెండు రోజుల కిందట నర్సాపురం ఎంపి గోకరాజు గంగరాజు రైతులకు ఆహ్వానాలు - వస్త్రాల పంపిణీలో పాల్గొన్నారు.
   
వీరిద్దరు మినహా మిగతావారంతా తమకేమీ సంబంధం లేదన్నట్లుగానే ఉంటున్నారు. మరో మంత్రి పి.మాణిక్యాలరావు - ఎమ్మెల్సీ సోము వీర్రాజు - ఇతర ఎమ్మెల్యే లు ఇప్పటి వరకూ అమరావతి ఛాయలకే రాలేదు. బిజెపి జిల్లా - రాష్ట్ర నాయకులు అనేక మంది జిల్లాలో పర్యటిస్తున్నా ఏర్పాట్ల లో పాలుపంచుకోవడం లేదు. ఈ అంశంపై బిజెపి రాష్ట్ర నాయకత్వమూ అంటీముట్టన్నట్లు వ్యవహరిస్తోంది. మరి ప్రధాని వచ్చిన రోజైనా వీరంతా కనిపిస్తారో లేదంటే అదీ తమకు తెలియదంటారో చూడాలి.

ఏపీ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండడమే కాకుండా టీడీపీ సహకారంతో గెలిచి, పదవులు అందుకున్న నేతలూ దీన్ని సొంత కార్యక్రమంలా ఫీలవడం లేదు. ప్రధాని వస్తున్నా.. కేంద్ర మంత్రి వెంకయ్య రాజధాని పనులపై తిరుగుతున్నా కూడా వీరు కిమ్మనడం లేదు. కామినేని శ్రీనివాస్ - గోకరాజు గంగరాజు తప్ప మిగతావారంతా తమకేమీ సంబంధం లేదన్నట్లుగానే ఉంటున్నారు. దీంతో ఏపీ బీజేపీకి కాస్త ఎక్కువైందని టీడీపీ నేతలు తమలో తాము అనుకుంటున్నారు.
Tags:    

Similar News