ఏపీ బీజేపీకి సీమాంధ్రుల సత్తా చూపించాల్సిందేనా?

Update: 2015-04-11 17:30 GMT
పచ్చ కామెర్ల వారికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందంటారు. ఎవరికి మనసు ఎలా ఉంటుందో సరిగ్గా అలానే వారి ఆలోచనలు.. మాటలు ఉంటాయి. తప్పులు వెతికే వారికి నిత్యం తప్పులే కనిపిస్తాయి. లోకమంతా మంచి అనుకునే వారికి తమ చుట్టూ వారు మంచినే చూస్తుంటారు. ఇలాంటివి ప్రతిఒక్కరికి అనుభవమే.

తాజాగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు తన మనసులోని మాటను బయటపెట్టారు. ఆయన తాను అనుకుంటున్న మాటను తన మాటగా చెబితే ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండేది కాదు. మహా అయితే.. ఇదేంది సార్‌.. ఇలా మాట్లాడుతున్నారు. ఇది తప్పు కదా అని ఒకరిద్దరు విమర్శించే వారు. కానీ.. తన మాటల్ని సీమాంధ్ర ప్రజల భావనగా చెప్పటమే అభ్యంతరకరంగా మారింది.

రాష్ట్ర విభజన కారణంగా ఏపీ ఎంతగా నష్టపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి విషయానికి నిత్యం అడుక్కునే బతుకునీడుస్తన్న ఏపీ సర్కారు తీరు.. ప్రతి ఒక్క సీమాంధ్రుడ్ని రగిలించేలా చేస్తోంది. కానీ.. తమను సమీకరించి.. తమ బాధను.. ఆవేదనను.. ఆవేశాన్ని.. ఆక్రోశాన్ని బయటకు చెప్పే నేతలు కనిపించక మనసులోని తెగ మదనపడిపోతున్నారు.

అలాంటి భావాలు కనిపించని సోమువీర్రాజుకు.. సీమాంధ్రులు మరోలా కనిపిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా కావాలని అందరూ కోరుకుంటున్నా.. వీర్రాజుకు మాత్రం అవేమీ కనిపించటం లేదు. ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రజలకు ఎలాంటి ఆసక్తి లేదని చెబుతున్నారు. దీనిపై కాంగ్రెస్‌నేతలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని చెబుతున్నారు.

ఇన్ని మాటలు చెప్పిన ఆయన మరో మాటను చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రజలకు ఆసక్తి లేదన్న విషయాన్ని తన వెంట వస్తే నిరూపిస్తానని కూడా ఆఫర్‌ ఇస్తున్నారు. ఉపకారం చేయకున్నా ఫర్లేదు కానీ అపకారం మాత్రం ఎవరికి చేయొద్దు అనే మాటకు పూర్తి భిన్నంగా ఉన్న వీర్రాజు మాటల్ని మొగ్గలోనే తుంచేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రజలకు ఆసక్తి ఉందా? లేదా? అన్న విషయం ఏపీ బీజేపీ నేతలకు తెలియజేయాల్సిన బాధ్యత సీమాంధ్రులపై ఉందన్న విషయం మర్చిపోకూడదు. చూస్తుంటే.. రేపో.. మాపో.. సీమాంధ్రులకు బాగుపడాలన్న ఆలోచన లేదు.. వారంతా పేదరికంగా.. దారుణమైన ఆర్థిక కష్టాలు అనుభవించాలని మహా కోరికగా ఉన్నారని వీర్రాజు లాంటి బీజేపీ నేతలు ప్రచారం చేస్తారేమో.

Tags:    

Similar News