వారసుడెవరు? : ఎంపీల చర్చంతా అదే!

Update: 2017-08-04 00:30 GMT
ఉపరాష్ట్రపతి కావడానికి సిద్ధపడుతున్న మాజీ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు.. గురువారం తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు అందరితోనూ ఆత్మీయ పూర్వకంగా భేటీ అయ్యారు. విందు ఇచ్చారు. ఇన్నాళ్లు తనకు అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ఎంపీల భేటీలో.. చాలా మంది ఎంపీల మధ్య కీలకంగా నడిచిన చర్చ ఏంటో తెలుసా? అసలింతకూ... వెంకయ్యనాయుడికి వారసుడిగా ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రి కాబోయేది ఎవరు? అనే అంశమే.

వెంకయ్య ఏపీ నుంచి ఎంపీగా కేంద్రమంత్రి పదవిలోకి వెళ్లకపోయినప్పటికీ.. ఏపీకి చెందిన వ్యక్తే గనుక.. ఏపీ మంత్రిగానే అంతా పరిగణిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆయన స్థానం ఖాళీ అవడంతో.. అందరి మధ్య అదే చర్చ జరుగుతోంది. ఒక దశలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కేంద్రంలో తెలుగుదేశం పార్టీకి అదనంగా మరో మంత్రి పదవి కూడా అడిగినట్లు ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం మారిన పరిస్థితులు - కేంద్రంలో మోడీ బలపడిన తీరు తెన్నులు - ఆయన వద్ద చంద్రబాబు నాయుడు హవా తగ్గడం - ఇత్యాది పరిణామాల నేపథ్యంలో.. తెదేపాకు దక్కడం మాత్రం అసాధ్యం అని అంతా అనుకుంటున్నారు. తెదేపా వారు కూడా తొలుత కొంత ఊగిసలాడినప్పటికీ.. తర్వాత దాని మీద ఆశ వదలుకున్నట్లే కనిపిస్తున్నారు.

కాకపోతే.. భాజపాలోనే మంత్రి పదవిని ఆశిస్తున్న వారు అనేకులు కనిపిస్తున్నారు. ఎంపీ పదవిలో లేకపోయినా సరే.. మంత్రి పదవి మాత్రం కావాలనుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఒకవైపు చంద్రబాబు మీద నిత్యం కత్తులు దూస్తూ ఉండే దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఈ ప్రయత్నాల్లో ఉన్నారని, అలాగే మాజీ కేంద్రమంత్రి అయిన కావూరి సాంబశివరావు - చంద్రబాబు అంటే కిట్టని - భాజపాలోని పలువురు సీనియర్లు కూడా కేంద్ర మంత్రి పదవి రేసులో ఉన్నారని విశ్వసనీయ సమాచారం.

ఎవరెన్ని ప్రయత్నాలు చేసిన మోడీ మంత్రాంగాన్ని ముందే పసిగట్టడం అసాధ్యం అనే భయం కూడా అందరిలోనూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పదవి దక్కదని తెలిసినప్పటికీ కూడా.. ఏ పుట్టలో ఏ పాముందో అనే ఉద్దేశంతో తమను కూడా పరిగణించాలని కోరుతున్న నాయకులు కూడా ఉంటున్నారట. తెలుగు ఎంపీల భేటీలో మొత్తానికి , కొత్త తెలుగు కేంద్రమంత్రి ఎవరో అనే చర్చ ఆసక్తి కరంగా సాగడం విశేషం.
Tags:    

Similar News