ఏపీ బ‌డ్జెట్ వాయిదా..

Update: 2017-03-12 10:38 GMT
నంద్యాల ఎమ్మెల్యే, టీడీపీ నేత భూమా నాగిరెడ్డి మృతికారణంగా రేపు జరగాల్సిన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం వాయిదా పడింది. తిరిగి మంగళవారం ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశం కానుంది. సభ ప్రారంభంకాగానే భూమా మృతిపట్ల సంతాప తీర్మానం ప్రవేశపెడతారు. సంతాప తీర్మానం తర్వాత సభ వాయిదా పడుతుంది. వాయిదా అనంతంరం బీఏసీ సమావేశం కానుంది. బడ్జెట్ ఎప్పుడు ప్రవేశ పెట్టాలనే దానిపై బీఏసీలో చర్చించనున్నారు. బడ్జెట్‌ ను బుధవారం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. కాగా, తీవ్రమైన గుండెపోటు కారణంగా ఇవాళ ఉదయం భూమా నాగిరెడ్డి స్వర్గస్తులైన విషయం తెలిసిందే.

భూమా నాగిరెడ్డి మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టీడీపీ కుటుంబ సభ్యుడిని కోల్పోయామని ఆవేదన వెలిబుచ్చారు. నాగిరెడ్డి కుటుంబానికి అండగా నిలుస్తామని పేర్కొన్నారు. తీవ్ర గుండెపోటు రావడంతో కన్నుమూసిన  భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు రేపు జరగనున్నాయి.

భూమా నాగిరెడ్డి మృతిపట్ల తెలంగాణ‌ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. భూమా కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ బాధాకర పరిస్థితి నుంచి వారు త్వరగా కోలుకోవాలని భగవంతున్ని కోరుకున్నారు. ఈ సమయంలో భూమా కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు. భూమా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనే వారని గుర్తు చేశారు.

నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతిపట్ల వైఎస్‌ఆర్‌సీపీ నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భూమా నాగిరెడ్డి తమ కుటుంబంలో ఒక సభ్యుడిలా మెలిగేవాడని పేర్కొన్నారు. భూమా కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని తెలియజేశారు. ఈ షాక్ నుంచి వారు త్వరగా కోలుకునేలా దేవుడు వారికి సహకరించాలని కోరుకున్నారు.

కాగా, భూమా అంత్యక్రియలు  రేపు ఆళ్లగడ్డలో నిర్వహించనున్నారు. అభిమానుల కోసం భూమా బౌతికకాయాన్ని కొద్దిసేపు నంద్యాలలో ఉంచి అనంతరం ఆళ్లగడ్డ తరలించనున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/

Tags:    

Similar News