చేసిందంతా చేసి.. ఇప్పుడు దీక్షా ర‌ఘువీరా?

Update: 2018-02-17 04:56 GMT
ఏపీలో ప‌రిస్థితుల‌న్నింటికి కార‌ణం కాంగ్రెస్ పార్టీనే. విభ‌జ‌న‌తో ఏపీని కుక్క‌లు చింపిన విస్త‌రి మాదిరి మార్చేసిన ఆ పార్టీ నేత‌లు ఇప్పుడు కొత్త రాగం అందుకుంటున్నారు. చేయాల్సిందంతా చేసేసి.. ఏపీని స‌ర్వ‌నాశ‌నం చేసిన ఏపీ కాంగ్రెస్ నేత‌లు ఇప్పుడు ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం దీక్ష చేస్తామ‌ని అంటున్నారు.

ఆంధ్రుల‌కు హ‌క్కుగా రావాల్సిన ప్ర‌త్యేక హోదాను టీడీపీ.. బీజేపీలు అట‌కెక్కించ‌టం దుర్మార్గంగా అభివ‌ర్ణిస్తున్నారు. అందుకే ఈ నెల 19న గుంటూరు క‌లెక్ట‌రేట్ ఎదుట ఆంధ్రుల ఆత్మ‌గౌర‌వ దీక్ష పేరుతో భారీ నిర‌స‌నను నిర్వ‌హిస్తున్న ప్ర‌క‌టించారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధించే వ‌ర‌కూ అవిశ్రాంతంగా పోరాడుతామ‌ని చెబుతున్న కాంగ్రెస్ నేత‌లు ఎవ‌రంటే.. ఏపీ విభ‌జ‌న స‌మ‌యంలో నోరు మెద‌ప‌ని ర‌ఘువీరా.. బాపిరాజు లాంటి నేత‌లే.

ఏపీ కాంగ్రెస్ నేత‌ల తీరు చూస్తే.. విభ‌జ‌న వేళ ఏపీ ప్ర‌జ‌ల‌కు తాము చేసిన పాపాల్ని దీక్ష‌తో దిద్దుకోవాల‌న్న‌ట్లుగా వారి తీరు ఉంది. ఎన్ని దీక్ష‌లు చేసినా..  ఆంధ్రోళ్ల‌కు వారు చేసిన అన్యాయం ఎప్ప‌టికి మ‌ర్చిపోర‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇప్పుడు దీక్ష చేస్తామ‌ని చెబుతున్న ర‌ఘువీరా అండ్ కోలు.. ఇదే హోదా అంశంపై పార్టీ మాజీ చీఫ్ సోనియ‌మ్మ‌.. ప్ర‌స్తుత చీఫ్ రాహుల్ గాంధీ నోటి నుంచి ఎందుకు రాదో స‌మాధానం ఇస్తే బాగుంటుంది.

చేయాల్సిందంతా చేసేసి.. ఏపీని స‌ర్వ‌నాశ‌నం చేసిన సోనియాకు ఏపీ విష‌యంలో తాను చేసింది అన్యాయ‌మ‌ని అనిపిస్తే.. రోడ్డు మీద‌కు వ‌చ్చి ఏపీకి తాను చేసిన అన్యాయం గురించి చెంప‌లు వేసుకోవ‌ట‌మే కాదు.. ఏపీకి చేయాల్సిన‌వ‌న్నీ వెంట‌నే చేయాల‌ని.. లేనిప‌క్షంలో ఆమ‌ర‌ణ‌దీక్ష చేస్తాన‌ని చెప్ప‌గ‌ల‌రా? అలాంటివేమైనా చేయ‌గ‌లిగితే ర‌ఘువీరా అండ్ కోలకు రోడ్ల మీద‌కు వ‌చ్చే అర్హ‌త ఉంటుంది. అంత‌వ‌ర‌కూ ఏపీలో హోదా దీక్ష‌లు చేసేందుకు నైతిక అర్హ‌త లేద‌ని చెప్పాలి. ఏపీ గుండెల్లో విభ‌జ‌న బాకును నిర్ద‌య‌గా దించేసిన కాంగ్రెస్ నేత‌ల‌కు ఏపీ కోసం త్యాగాలు చేసేంత విశాల హృద‌యం ఉంటుంద‌ని అనుకోవ‌టం అత్యాశే అవుతుంది.
Tags:    

Similar News