బాబు - రాహుల్ భేటీ..ఏపీ కాంగ్రెస్ నుంచి ఒక్కరూ లేరు!

Update: 2018-11-02 12:58 GMT
రాజు వెడలె రవితేజములలరగ అన్నట్లుగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన మందీమార్బలాన్ని వెంటేసుకుని దిల్లీ వెళ్లడం చూసినవారంతా ఆయనేదో పెళ్లికి వెళ్తున్నారని అనుకోవచ్చు... కానీ, ఆయనలా వంధిమాగధులను వెంటేసుకుని వెళ్లింది పెళ్లికి కాదు - తన మామ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఆగర్భ శత్రువైన కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యుడిని కలవడానికి వెళ్లారు. అవును... కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలవడానికే ఆయన దిల్లీ వెళ్లారు. రూట్ కెనాల్ రామకృష్ణుడు - వెయిట్ లాస్ ఎక్స్ పర్ట్ సీఎం రమేశ్ - టీచింగ్ ఫిష్ రామ్మోహననాయుడు.. ఇంకా చాలామందిని వెంటేసుకుని ఆయన రాహుల్ వద్దకు వెళ్లారు.
   
అయితే... కాంగ్రెస్ - టీడీపీల ఈ పెళ్లిక చంద్రబాబు భాజాభజంత్రీలతో వెళ్లినప్పటికీ ఏపీకి చెందిన కాంగ్రెస్ పెళ్లివారు మాత్రం ఒక్కరు కూడా రాలేదు. ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా కానీ - వెటరన్ బ్యాట్స్‌ మన్ కిరణ్ కుమార్ రెడ్డి కానీ - ప్రజారాజ్యం విక్రేత చిరంజీవి కానీ ఈ పెళ్లికి రాలేదు.
   
ఏపీ కాంగ్రెస్‌లో ఏ ఒక్కరికీ టీడీపీతో కలవడం ఇష్టం లేదట. కానీ, చంద్రబాబు ఏదో రకంగా రాహుల్‌ వద్దకు రాయబారాలు నడిపి మెల్లగా ఈ పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు. చంద్రబాబును అందరూ వదిలేయడం.. ఎవరితో కలిసైనా సరే వచ్చే ఎన్నికల్లో నాలుగు లోక్ సభ సీట్లు అదనంగా కనాలన్న రాహుల్ గాంధీ తాపత్రయం కలిసి ఈ పెళ్లికి దారితీసింది.  రిజిస్ట్రార్ ఆఫీసు పెళ్లి తరహాలో జరిగిపోయింది.
   
రాష్ట్ర వభజన తరువాత కాంగ్రెస్ పార్టీపై ఎంత కోపమొచ్చినా కూడా ఏపీ కాంగ్రెస్ నుంచి చాలామంది నేతలు దాన్ని మనసులోనే దాచుకున్నారు. కొద్దిమంది టీడీపీలో చేరి పదవులు - టిక్కెట్లు సంపాదించుకున్నా మరికొందరు మాత్రం టీడీపీలో చేరలేదు. కాంగ్రెస్‌ లో యాక్టివ్‌ గా తిరగనప్పటికీ వారు ఖాళీగానే ఉన్నారు కానీ టీడీపీలో చేరలేదు. అలాంటివారంతా ఇప్పుడీ పొత్తును జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్లడం - జనాలకు ముఖం చూపించడం చాలా కష్టమంటున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్న తరువాత నాలుగన్నరేళ్లుగా నానా కష్టాలు పడి జనాల్లో ఉన్న ఆగ్రహం పోయేలా చేసుకుంటే ఇప్పుడు మళ్లీ చంద్రబాబుతో కలిసి మళ్లీ జనాగ్రహానికి గురి కావాల్సిన పరిస్థితి తీసుకొచ్చారని అంటున్నారు. ఈ కారణంగానే తమ రాష్ట్రానికి చెందిన రాజకీయమైనా కూడా ఏపీ లీడర్ ఒక్కరు కూడా ఈ భేటీకి వెళ్లలేదని టాక్.
Tags:    

Similar News