మరిన్ని రుణాల కోసం జగన్ సర్కారు లేఖ

Update: 2019-12-08 10:50 GMT
ఏపీ సీఎం జగన్ భారీ వరాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఎన్నికల వేళ ఇచ్చిన నవరత్నాలను ఇప్పటికే అమలు చేస్తున్న సీఎం జగన్.. తాజాగా పాఠశాలలకు వెళుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ‘అమ్మఒడి’ పథకాన్ని ప్రారంభించారు. జనవరిలో పాఠశాలకు వెళ్లే ప్రతి పిల్లవాడి తల్లికి రూ.15000 ఇవ్వడానికి రెడీ అయ్యారు.

అయితే ఈ ప్రతిష్టాత్మక పథకానికి భారీగా నిధులు అవసరం. ఈ నేపథ్యంలో నిధుల సమీకరణలో జగన్ సర్కారు పడింది. తాజాగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ఆర్బీఎం నిబంధనలు సడలించాలని.. 15వేల కోట్ల రూపాయల రుణాలను అనుమతించాలని ఏపీ ప్రభుత్వం తాజాగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. కేంద్రంగనుక అనుమతిస్తే అమ్మ ఒడి పథకానికి రుణాలు తీసుకొని పథకం అమలు చేయాలని జగన్ సర్కారు యోచిస్తోంది.

అయితే ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం 33,617 కోట్ల విలువైన రుణాలను వివిధ సంస్థలనుంచి తీసుకుంది. ఒక్క నవంబర్ నెలలోనే  ఏకంగా 8513 కోట్ల విలువైన  అప్పులు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా నాలుగు నెలల సమయం ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం నిబంధనలు ప్రకారం మరో 3వేల కోట్లు మాత్రమే రుణం తీసుకోవడానికి పరిమితి ఉంది. అయితే ఇవి అమ్మఒడి పథకానికి సరిపోవు కాబట్టి ఎఫ్ఆర్బీఎం నిబంధనలు సడలించాలని కేంద్రాన్ని కోరుతోంది.  

అయితే ఇప్పటికే ఆర్థికమాంద్యంతో సతమతమవుతున్న  కేంద్రంలోని బీజేపీ సర్కారు  ఆర్థిక విషయాల్లో స్ట్రిక్ట్ గా ముందుకెళ్తోంది. మరి జగన్ అప్పుల మొరను ఆలకిస్తుందో లేదో తెలియడం లేదు. కేంద్రం కనుక ఎఫ్ఆర్బీఎం పరిమితిని సడలించకపోతే రాబోయే నెలల్లో జీతాలు, పెన్షన్లు, అమ్మఒడి పథకం అమలు చేయడం ఏపీ ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారనుంది.

    

Tags:    

Similar News