టీడీపీ కాపు నేతలను భయపెడుతున్న గర్జన

Update: 2016-01-27 17:27 GMT
తెలుగుదేశం పార్టీలోని కాపు నేతలు - మరీ ముఖ్యంగా కాపు మంత్రులు ఇరకాటంలో పడ్డారు. కాంగ్రెస్ నాయకుడు ముద్రగడ పద్మనాభం పెట్టిన ఈ మంట వారిని ఎక్కడా నిలవనివ్వకుండా తరుముతోంది. ఈ నెలాఖరున తూర్పుగోదావరి జిల్లా తునిలో కొబ్బరి తోట వేదికగా జరగనున్న కాపుగర్జనకు హాజరు కావాలో వద్దో తేల్చుకోలేక తెగ సమతమవతున్నారు. బాబు క్యాబినెట్‌ లో కాపు వర్గానికి చెందిన నిమ్మకాయల చిన రాజప్ప - గంటా శ్రీనివాసరావు, నారాయణ - కిమిడి మృణాళిని మంత్రులుగా కొనసాగుతున్నారు.. వీరితో పాటు బీజేపీకి చెందిన పైడికొండల మాణిక్యాలరావు కూడా కాపు నేతే. వీరిలో హోంమంత్రి చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తోన్న తూర్పు గోదావరి జిల్లాలోని తుని లో కాపు గర్జన జరుగుతుండటంతో ఆ జిల్లా నేతగా ఆయన బాగా ఇరకాటంలో పడిపోయారు.

మరోవైపు తుని దాటగానే ప్రారంభమయ్యే విశాఖ జిల్లా నుంచి మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  అలాగే కాపు మంత్రి నారాయణ కూడా ప్రభుత్వంలో కీలకంగానే ఉన్నారు. మృణాళిని పెద్దగా ప్రాధాన్యంగా లేనప్పటికీ బీజేపీ పరంగా మాణిక్యాలరావు కూడా గోదావరి జిల్లాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు.
    
మరోవైపు టీడీపీలో 20 మంది ఎమ్మెల్యేలు - ఇద్దరు ఎంపిలు - ఒక ఎమ్మెల్సీలు కాపు వర్గం నుంచి ఉన్నారు. వీరు కాకుండా జడ్పీటీసీ - ఎంపిటిసి - మునిసిపల్ చైర్మన్లు వందల సంఖ్యలో టిడిపి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, తునిలో భారీ స్థాయిలో నిర్వహించనున్న కాపుగర్జనకు హాజరుకావాలా? వద్దా? అన్న అంశంపై వారిని తర్జనభర్జనకు గురిచేస్తోంది.  సభకు హాజరుకావాలన్న ఒత్తిడి ఇప్పటికే పెరుగుతోంది. హాజరయితే ఒక సమస్య, గైర్హాజరయితే మరొక సమస్య వారిని వెన్నాడుతోంది. హాజరయితే పార్టీ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయోనన్న ఆందోళన... హాజరుకాకుంటే కాపుల్లో తమ చిత్తశుద్ధిపై నమ్మకం పోతుందేమోనన్న భయం వారిలో కనిపిస్తోంది.
    
మరోవైపు ఇప్పటికే ముద్రగడ పద్మనాభం నిర్వహించే కాపుగర్జన వెనక వైసీపీ - కాంగ్రెస్ ప్రోత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది. అసలు వైసీపీ ఈ వ్యవహారాన్ని తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని చూస్తున్నందున, గర్జనకు వ్యతిరేకంగా సొంత పార్టీకి చెందిన కాపు నేతలతో తెదేపా ప్రకటనలు ఇప్పిస్తోంది. బొండా ఉమామహేశ్వరరావు అదే అంశంపై జిల్లాల్లో పర్యటించి, కాపులను వెళ్లకుండా నియంత్రించే పనిలో బిజీగా ఉన్నారు. కొత్తగా కార్పొరేషన్ చైర్మన్ అయిన చలమశెట్టి కూడా అదే పనిలో ఉన్నారు. దానితో సభకు హాజరైతే పార్టీ నాయకత్వం నుంచి ఇబ్బందులు ఎదురవుతాయన్న భావన టీడీపీ కాపు నేతల్లో కనిపిస్తోంది.  హాజరుకాకపోతే అంతకుమించిన ప్రమాదం లేకపోలేదన్న ఆందోళనా ఉంది.  తమ నియోజకవర్గాల్లోని కాపులంతా ప్రత్యేత బస్సులు - వాహనాలు వేసుకుని తునికి వెళుతుంటే, తాము మాత్రం వెళ్ల కుండా.. తునికి వెళ్లేవారిని అడ్డుకోవటం వల్ల స్థానికంగా కాపులు, ప్రధానంగా కాపు యువతతో భవిష్యత్తులో వ్యతిరేకత ఎదుర్కోవలసి వస్తుందన్న ఆందోళన పెరుగుతోంది.పైగా, సభకు హాజరుకాని వారిని కాపు ద్రోహులుగా చిత్రీకరిస్తే రాజకీయంగా దెబ్బపడతుందని భయపడుతున్నారు.
Tags:    

Similar News