పవన్ ఎఫెక్టేనా... : ఎట్టకేలకు అలీకి కీలక పదవి

Update: 2022-10-27 14:53 GMT
టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ అలీకి ఎట్టకేలకు కీలకమైన పదవి లభించింది. ఆయనను జగన్ ప్రభుత్వం ఏపీ ఎలక్ట్రానిక్  మీడియా అడ్వైజర్ గా నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. క్యాబినెట్ ర్యాంక్ కలిగిన ఈ పదవిలో అలీ రెండేళ్ల పాటు కొనసాగుతారు. అలీకి ఈ పదవి రావడం అందునా ఎన్నికలు ఏణ్ణర్ధం వ్యవధిలోకి వచ్చాక దక్కడం అంటే రాజకీయ సమీకరణల ప్రభావమే అని అంటున్నారు.

నిజానికి చూస్తే వైసీపీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో మద్దతు బహు తక్కువ. కానీ అనూహ్యంగా ఆశ్చర్యకరంగా ఎన్నికలకు ముందు అలీ వైసీపీలో చేరారు. ఆయన జగన్ కి జై కొట్టారు. అలీ సినీ పరిశ్రమలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితుడు. పవన్ దాదాపుగా పాతిక పైగా సినిమాల్లో నటిస్తే అన్నింటిలో అలీ ఆయన పక్కన కనిపిస్తారు. అంటే అంతటి బలమైన తెర బంధం వారిది. ఇక నిజ జీవితంలో కూడా పవన్ మనసుకు దగ్గరగా ఉండే కొద్ది మంది మిత్రులలో అలీ ఒకరు అని చెబుతారు.

అలాంటి అలీ తనకు అత్యంత మిత్రుడు అయిన పవన్ జనసేన ద్వారా 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తూ ఒక భారీ రాజకీయ సాహసం చేస్తే ఆయనకు అండగా నిలవకుండా జగన్ కి మద్దతు ఇవ్వడం అప్పట్లో సంచలనం రేపింది. దాని మీద పవన్ నుంచి కూడా విమర్శలు వస్తే అలీ ధీటుగా ఆయనకు కౌంటర్ ఇచ్చారు. తాను స్వయంసిద్ధంగా ఎదిగిన వాడిని అని రిటార్ట్ ఇచ్చారు. ఆ తరువాత ఈ ఇద్దరు మధ్య మళ్లీ బంధం బలపడినట్లుగా లేదని అంటారు.

అయితే రాజకీయాల్లో ఎపుడైనా ఏదైనా సాధ్యమని అంటారు. కాబట్టి అలీ ఈ మధ్య తన మనసు మార్చుకున్నారని, మూడున్న్నేఅళుగా వైసీపీలో ఉన్నా తనకు సరైన న్యాయం జరగలేదని భావించి విసిగి జనసేన వైపు వెళ్తారని ప్రచారం గట్టిగా సాగింది. అలీ రాజమండ్రీ సీటు కోరుకుంటున్నారని, గోదావరి జిల్లాలలో జనసేనకు ఇపుడు అనుకూల పవనాలు వీస్తున్నాయని, అందువల్ల అలీ ఆ వైపుగా జంప్ చేస్తారు అని వార్తలు వచ్చాయి. అయితే దానిని వెంటనే అలీ ఖండించారు. కానీ వైసీపీకి సీన్ ఏంటో అర్ధమైంది అంటారు

ఇక ఆ తరువాత చూస్తే విశాఖ ఎపిసోడ్ తో పవన్ కళ్యాణ్ వైసీపీకి గట్టిగా ఎదురునిలిచే స్థాయికి చేరుకున్నారు.  ఆయన మంగళగిరి పార్టీ ఆఫీసులో ఏకంగా వైసీపీ వారి మీద అనుచిత భాషను ఉపయోగించి తొడగొట్టారు. టీడీపీతో చేతులు కలిపారు. దాంతో పవన్ పొలిటికల్ గా మరింత స్ట్రాంగ్ అవుతున్నారు అని వైసీపీ గ్రహించింది. ఈ నేపధ్యంలో వైసీపీ నుంచి ఎవరైనా ఆ వైపు తొంగి చూడవచ్చు అన్న ఆలోచనలు ఒక వైపు ఉంటే మరో వైపు అలీ లాంటి సినీ సెలిబ్రిటీస్ కూడా టీడీపీ జనసేన కూటమి వైపు వెళ్తే భారీగా రాజకీయ నష్టం జరుగుతుందని భావినే అర్జంటుగా ఫైల్ బయటకు తీసి మరీ అలీకి నామినేటెడ్ పదవిని కట్టబెట్టారు అని ప్రచారం అయితే సాగుతోంది.

అలీకి కమెడియన్ గా మంచి గుర్తింపు ఉంది. వచ్చే ఎన్నికల్లో ఆయన చేత ప్రచారం చేయించుకోవడంతో పాటు వీలైతే పవన్ మీద విమర్శలు చేయడానికి కూడా ఉపయోగించుకోవచ్చు అన్న ఆలోచనలతోనే వైసీపీ ఆయనకు పదవి ఇచ్చి దగ్గర చేసుకుంది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే అలీకి పదవి రావడం వెనక కచ్చితంగా పవన్ ఎఫెక్ట్ ఉందనే విశ్లేషణలు ఉన్నాయట.

ఇక ఎమ్మెల్సీ అనుకున్నారు. రాజ్యసభ అని ప్రచారం చేసారు. వక్స్ బోర్డ్ చైర్మన్ అన్నారు. చివరికి అలీకి అడ్వైజర్ పదవి దక్కింది. ఇది క్యాబినెట్ ర్యాంక్ కలిగినది కావడంతో  అలీ దీని వల్ల ఫుల్ హ్యాపీ అవుతారని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.  మొత్తానికి అలీని చేజారకుండా వైసీపీ సరైన సమయంలో పావులు కదిపింది అంటున్నారు. దీని వల్ల ఆయన వైసీపీలో కచ్చితంగా ఉంటారని చెప్పవచ్చు అని ఆ పార్టీ వారు అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News