మంత్రి అనిల్... పీకేను ఎంత మాటన్నారంటే?

Update: 2019-12-02 17:10 GMT
జనసేనాని పవన్ కల్యాణ్ వైరి వర్గాలపై... ప్రత్యేకించి వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. జగన్ సీఎం స్థాయిలో వ్యవహరించడం లేదని ఆరోపణలు చేస్తున్న పవన్... ఆ స్థాయిలో వ్యవహరించేదాకా ఆయనను తాను జగన్ రెడ్డి అనే పిలుస్తానని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ తరహాలో తనదైన శైలిలో స్వైర విహారం చేస్తున్న పవన్ కు కౌంటర్ ఇచ్చేందుకు ఎంట్రీ ఇచ్చిన వైసీపీ యువ నేత, ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్... పవన్ పై ఓ రేంజిలో ఫైరైపోయారు. ఈ సందర్భంగా చంద్రబాబు అడుగుజాడల్లోనే పవన్ నడుస్తున్నారని చెప్పిన అనిల్.. పవన్ ను ఏకంగా హచ్ కుక్కతో పోల్చేశారు. అంతేకాకుండా పవన్ చేసిన ప్రతి వ్యాఖ్యను ప్రస్తావిస్తూనే వాటికి కౌంటర్లుగా అనిల్ చేసిన వ్యాఖ్యలు బాగానే పేలాయయన్న వాదనలు వినిపిస్తున్నాయి.

పవన్‌ కల్యాణ్‌ ను రాజకీయ అజ్ఞానిగా అభివర్ణించేసిన అనిల్‌... పవన్‌ను రాజకీయ నాయకుడు అనాలో.. నటుడు అనాలో అర్థం కావడం లేదన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు మతిస్థితమితం పోయి ఏమి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదనుకుంటే.. పవన్‌ కూడా బాబు మాదిరే మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దమ్ము, ధైర్యం గురించి మాట్లాడే హక్కు పవన్‌కు లేదన్నారు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం సోనియా గాంధీని ఎదురించిన వ్యక్తి జగన్‌ అని అనిల్ గుర్తుచేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ దమ్ము, ధైర్యం గురించి ప్రజలందరికీ తెలుసనని... పవన్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని కూడా అనిల్ తనదైన శైలి కౌంటర్లు సంధించారు. జగన్‌ సీఎం అయ్యాక రాయలసీమ పచ్చని డెల్టాగా మారిందన్నారు. 

ప్రశ్నిస్తానన్న పవన్‌ గడచిన ఐదేళ్లలో ఏమి చేశాడో అందరికీ తెలుసిందేనని అనిల్ విమర్శించారు. పవన్‌ నిత్యం కులాలు, మతాల గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డ అనిల్... జగన్ మాత్రం తన మతం మానవత్వం అని స్పష్టంగా చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. పవన్‌కు తెలుగు మీడియం మీద అంత ప్రేమ ఉంటే.. ఆయన పిల్లలను ఇంగ్లిష్‌ మీడియంలో ఎందుకు చదివిస్తున్నారని ప్రశ్నించారు. పవన్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో రెచ్చిపోయి మాట్లాడుతున్నారని.. వారిని పవనే  సన్మార్గంలో పెట్టాలని హితవు పలికారు. జగన్‌పై కడుపు మంటతోనే పవన్‌, చంద్రబాబు నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని అనిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే 2017లో కర్నూలు జిల్లాలో జరిగిన సంఘటనను పట్టుకుని జగన్‌ పాలనలో జరిగనట్టుగా పవన్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కర్నూలు ఘటన బాబు హయాంలో జరిగిన ఘటన అని తెలియదా? అని పవన్ ను నిలదీశారు. పవన్‌ ముందు న్యూస్‌ పేపర్‌ చదవడం నేర్చుకోవాలని అనిల్ సూచించారు. ఎన్నికల్లో ప్రజలు ఎవరి తోలు తీసారో అందరికీ తెలుసనని కూడా అనిల్ తనదైన శైలి సెటైర్ సంధించారు. పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయిన పవన్‌కు... వచ్చే ఎన్నికల్లో డిపాజిట్‌ కూడా రాదని అనిల్ జోస్యం చెప్పారు.
Tags:    

Similar News