కేసీఆర్ మాన‌స పుత్రిక ప‌థ‌కం...అన్నాహజారే మ‌న‌సు గెలిచింది

Update: 2019-01-19 15:28 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం ఇప్ప‌టికే వివిధ రాష్ర్ట‌ల‌ను ఆక‌ట్ట‌కుంటున్న సంగ‌తి తెలిసిందే. కొన్ని రాష్ర్టాలు ఈ ప‌థ‌కాన్ని య‌థాత‌థంగాఅమ‌లు చేస్తుండ‌గా...మ‌రికొన్ని రాష్ర్టాలు మార్పులు చేసి అమ‌లు చేస్తున్నాయి. ఇదిలాఉడ‌గా, తాజాగా ఈ ప‌థ‌కంపై సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే ప్రశంసల వర్షం కురిపించారు. హెచ్‌ఐసీసీలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సుకు అన్నాహజారే హాజరయ్యారు. ఈ సందర్భంగా అన్నాహజారే ఓ టీవీ ఛాన‌ల్‌తో మాట్లాడుతూ రైతుబంధును ప్ర‌శంసించారు.

 రైతుబంధు పథకం రైతుల పాలిట ఆశాదీపమ‌ని అన్నాహజారే కొనియాడారు. ``రైతుబంధు మంచి పథకం. రైతులకు ఇలాంటి పథకం అవసరం. ప్రతి రాష్ట్రంతో పాటు కేంద్రం కూడా రైతుబంధు గురించి ఆలోచన చేయాలి. సమర్థ నాయకత్వం వల్లే తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది`` అని అన్నాహజారే పేర్కొన్నారు. తెలంగాణ అమలు చేస్తున్న రైతుబంధు దేశానికి అత్యవసరమని చెప్పారు. ``అన్ని రాష్ర్టాలు తప్పకుండా రైతుబంధు లాంటి పథకాలు అమలు చేయాలి. కేంద్రానికి వ్యాపారులపై ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదు. రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నా కేంద్రానికి పట్టింపు లేదు. స్వామినాథ‌న్‌ కమిషన్ సిఫారసులు అమలు చేస్తున్నామని కేంద్రం అబద్దాలు చెప్తోంది. రైతుబంధు పథకం సముద్రంలో దీపస్తంభం లాంటిది`` అని అన్నాహజారే పేర్కొన్నారు. ``వ్యవసాయ అభివృద్ధికి నీరు, నీటి కోసం ప్లానింగ్ తో పాటు పంట ప్రణాళిక, సరైన మార్కెటింగ్ వసతులు కల్పించినప్పుడే రైతుల జీవితాలు బాగుపడుతాయి. కానీ రైతులను పట్టించుకునే వారే కరువయ్యారు`` అని అన్నా హజారే ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా,  గాంధేయ మార్గంలో సుస్థిర అభివృద్ధి, ఆవిష్కరణలు అనే అంశంపై జ‌రిగిన ఈ సదస్సులో అన్నా హజారే మాట్లాడుతూ.. ఏడాది, ఐదేళ్లు, పదేళ్లు ప్రాతిపదికగా లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగాలని సూచించారు. యువశక్తి సరికొత్త దిశగా ప్రయాణించి అద్భుతాలు సృష్టించాలని చెప్పారు. జీవింతలో సాధించాల్సిన లక్ష్యాలపై ముందే స్పష్టత ఉండాలన్నారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా వెనుకడుగు వేయొద్దన్నారు. నిరంతరం నేర్చుకోవాలనే జిజ్ఞాస కూడా యువతలో ఉండాలన్నారు. ప్రజలకు సేవ చేసేందుకే మనల్ని దేవుడు ఇక్కడికి పంపారు. భగవంతుడు పుణ్యక్షేత్రాల్లోనే కాదు.. అన్ని చోట్లా ఉంటాడు అని అన్నా హజారే తెలిపారు.


Full View
Tags:    

Similar News