కేసీఆర్ కు మరో కష్టం.. తాజా నివేదికతో తిప్పలు ఖాయమట

Update: 2019-11-06 07:24 GMT
కొన్నిసార్లు అంతే. తెచ్చి పెట్టుకునే కష్టాలు కొన్ని అయితే.. కోరుకోకుండా వచ్చి పడే కష్టాలు మరికొన్ని. ఇప్పుడు అలాంటి ఇబ్బందినే ఎదుర్కొంటున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై కటువుగా ఉన్న కేసీఆర్.. వారి విషయంలో వెనక్కి తగ్గేందుకు ససేమిరా అంటున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. డెంగ్యూని కంట్రోల్ చేసేందుకు కేసీఆర్ కిందామీదా పడుతున్నా.. దోమలు మాత్రం తెలంగాణ సర్కారుకు ఎప్పటికప్పుడు కొత్త తిప్పలు తెచ్చేస్తున్నాయి.

ఇప్పటికే డెంగ్యూ విషయంలో రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా స్పందించటమే కాదు.. తెలంగాణ సర్కారుకు పదే పదే తలంటిన వైనం తెలిసిందే. ఇలాంటివేళ.. తాజాగా డెంగ్యూకి సంబంధించి షాకింగ్ నివేదిక ఒకటి బయటకు వచ్చింది. మూడు నాలుగు నెలలుగా తెలంగాణ ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన డెంగ్యూ.. విష జ్వరాలకు సంబంధించి పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల మంచిర్యాల జిల్లాలో ఒకే కుటుంబంలో నలుగురు డెంగ్యూ బారిన పడి మరణించటం పరిస్థితి తీవ్రతను తెలియజేసేలా ఉందని చెప్పాలి.

ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా రక్త నమూనాల్ని పరీక్షలు జరిపింది. ఈ సందర్భంగా వారికి షాకింగ్ నిజం ఒకటి బయటకువచ్చింది. తాజాగా వారు రూపొందించిన నివేదిక ప్రకారం ప్రతి నలుగురిలో ఒకరికి డెంగ్యూ ఉన్నట్లు గుర్తించారు. తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ.. చికెన్ గున్యా.. విషజ్వరాల తీవ్రతను తెలియజేసేలా తాజా నివేదిక ఉన్నట్లు చెబుతున్నారు.

తాజా నివేదిక ప్రకారం రాష్ట్రంలో 40, 434 మంది రక్త నమూనాల్ని సేకరించగా.. అందులో 10,237 మందికి డెంగీ ఉన్నట్లు నిర్దారణ జరిగిందన్నారు. అధికారిక లెక్కలు ఇలా ఉంటే.. అనధికారిక లెక్కల ప్రకారం ఇరవై వేల వరకూ డెంగ్యూ  బాధితులు ఉన్నట్లు చెబుతున్నారు. ఇంత జరిగినా.. డెంగ్యూ  కారణంగా మరణాలు రెండేనని ప్రభుత్వం చెబుతోంది. దీనిపై పలువురు తప్పు పడుతున్నారు. మిగిలిన అందరి సంగతి వదిలేద్దాం. మంచిర్యాల జిల్లాలో ఒకే కుటుంబంలో డెంగ్యూ కారణంగా నలుగురు మరణించిన విషయంపై అధికారులు ఏం చెబుతారు? ఇద్దరే చనిపోతే.. ఒకే కుటుంబంలో నలుగురి ఎందుకు చనిపోయినట్లు? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలంటున్నారు.

డెంగ్యూ.. విష జ్వరాలపై తాజాగా రూపొందించిన నివేదిక తెలంగాణ ప్రభుత్వానికి తలనొప్పిగా మారటమే కాదు.. హైకోర్టు చేతిలో మరోసారి చీవాట్లకు రెడీ కావాలంటున్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని.. డెంగ్యూ.. విష జ్వరాల మీద తెలంగాణ సర్కారు సమరశంఖాన్ని పూరించి.. యుద్ధ ప్రాతిపదికన జ్వరాలకు అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరీ విషయంలో కేసీఆర్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
Tags:    

Similar News