వర్షాలతో విసిగిన ఏపీ ప్రజలకు మరో షాకింగ్ న్యూస్

Update: 2021-11-22 07:30 GMT
వాన పడితే మనసు పులకరించిపోతుందన్న మాట ఇప్పుడు ఎక్కడ చెప్పినా ఫర్లేదు కానీ ఏపీలో అంటే మాత్రం జనాలు చితక్కొట్టేయటం ఖాయం. అంతలా వానలతో విసిగిపోయారు ఏపీ ప్రజలంతా. విడవకుండా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికి జరిగిన నష్టం ఒక ఎత్తు అయితే.. పాడు వానలతో రోడ్లు.. ప్రాజెక్టు.. ఇలా ఒకటేమిటి మౌలిక సదుపాయాలకు సంబంధించి బోలెడన్ని ఇష్యూలు ఇప్పుడు వేధిస్తున్న పరిస్థితి. వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా వర్షాల కారణంగా అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇక.. చిత్తూరు..కడప.. నెల్లూరు జిల్లాల సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు.

భారీ వర్షాలతో విసిగిపోయిన ఏపీ ప్రజలకు మరో వర్షపు ముప్పు ముంచుకొస్తుందని చెబుతున్నారు. మరోనాలుగు రోజుల్లో అంటే.. ఈ నెల 26 నుంచి డిసెంబరు 2 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో.. వాన మాటంటేనే ఉలిక్కిపడుతున్న ప్రజలకు రానున్న రోజుల్లోకురిసే వర్షాలు ఇప్పుడే భయపెడుతున్నాయి.

ఇంతకీ రానున్న రోజుల్లో కురిసే వర్షాలకు కారణం ఏమిటన్న విషయాన్ని వాతావరణ శాఖ అధికారులు విశ్లేషిస్తూ.. దక్షిణ అండమాన్ సముద్రం.. పరిసర ప్రాంతాల్లో తక్కువ ట్రోపోస్పియరిక్ స్థాయిలో సర్య్కులేషన్ ఉందని.. నాలుగు రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని చెబుతున్నారు.

దీని కారణంగా ఇప్పటికే వర్షాల కారణంగా ఇబ్బంది పడుతున్న చిత్తూరు...కడప.. నెల్లూరు జిల్లాలతో పాటు.. అనంతపురం.. ప్రకాశం జిల్లాల మీదా దీని ప్రభావం ఉంటుందని చెబుతున్నారు.
రానున్న ముప్పు ఇలా ఉంటే.. ఇప్పటికే కురిసిన వర్షాలు చేసిన డ్యామేజ్ అంతా ఇంతా కాదని చెబుతున్నారు.

అధికారుల అంచనా ప్రకారం చిత్తూరు జిల్లాలోనే వ్యవసాయ పంటల నష్టం 12 వేల ఎకరాలుగా ఉంటే.. మిగిలిన జిల్లాలతో కలిపితే మరింత ఎక్కువగా ఉందంటున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా చోటు చేసుకున్న వరదల కారణంగా ప్రభావితమైన గ్రామాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. అధికారుల రికార్డుల ప్రకారం నెల్లూరు.. చిత్తూరు..కడప.. అనంతపురం జిల్లాల్లో మొత్తం 172 మండలాల్లోని 1316 గ్రామాల మీద వరద ప్రభావం ఉందని పేర్కొన్నారు. పెద్ద ఎత్తున ప్రజల పునరావాస కేంద్రల్లో తలదాచుకుంటున్నారు.
Tags:    

Similar News