ఇక‌.. కాపుల పార్టీగా బీజేపీ.. మున్ముందు జ‌రిగేది ఇదేనా!?

Update: 2021-01-17 00:30 GMT
సామాజిక వ‌ర్గాల వారీగా పార్టీలు పెరుగుతున్న విష‌యం తెలిసిందే. ఒక‌ప్పుడు అంద‌రినీ క‌లుపుకొని పోయే రాజ‌కీయ పార్టీలు.. రాను రాను సామాజిక వ‌ర్గాల ప్ర‌భావానికి గుర‌వుతున్నాయి. ఏపీ తీరును ప‌రిశీలిస్తే.. ద‌శాబ్దం కింద‌టి వ‌ర‌కు ఎలాంటి ప‌రిస్థితి ఉన్నా.. ఆ త‌ర్వాత ఏపీ రాజ‌కీయాల‌తో సామాజిక వ‌ర్గాల క‌ల‌యిక.. క‌లిసి న‌డ‌క‌..వంటివి  పెరిగాయి.  ఈ క్ర‌మంలో జాతీయ పార్టీల‌ను మిన‌హాయిస్తే.. ఇప్పుడున్న ప్రాంతీయ పార్టీల‌పై సామాజిక వ‌ర్గాల ముద్ర స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. గ‌తంలో కాంగ్రెస్ పార్టీ బ‌లంగా ఉన్న‌ప్పుడు ఆపార్టీకి అన్ని విధాలా అండ‌గా ఉన్న ఉభ‌య గోదావ‌రి స‌హా తీర‌ప్రాంత జిల్లాల కాపు నాయ‌కులు 2014 త‌ర్వాత కాంగ్రెస్ ప‌రిస్థితి ద‌య‌నీయంగా మార‌డంతో ఇప్పుడు రాజ‌కీయంగా ఉనికిని చాటుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

అయితే.. కార‌ణాలు ఏవైనా కావొచ్చు.. ఫ‌లానా పార్టీకి కాపులు సంపూర్ణంగా చేరువ‌య్యార‌ని చెప్ప‌లేని ప‌రిస్థితి ఉంది. ఇక‌, కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్థాపించిన జ‌న‌సేన‌కు కాపుల్లోని చాలా మంది మ‌ద్ద‌తు తెలుపుతున్నా.. కీల‌క‌మైన నాయ‌కులు మాత్రం ప్ర‌స్తుతం ఆ పార్టీ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే వారు కొంత గంద‌ర‌గోళానికి గుర‌వుతున్న ప‌రిస్థితి ఉంది. ఇక‌, మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌.. కాంగ్రెస్‌లో ఉన్న స‌మ‌యంలో కాపుల‌కు ఒక స్వ‌ర్ణ‌యుగ‌మ‌నే చెప్పాలి. కీల‌క‌మైన నాయ‌కుడిగా ఆయ‌న ఎదిగారు. మంత్రిగా కూడా చ‌క్రం తిప్పారు. ఇక‌, త‌ర్వాత ప‌రిణామాల్లో ఆయ‌న బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ క్ర‌మంలోనే అనూహ్యంగా ఆయ‌న‌కు రాష్ట్ర పార్టీ అధ్య‌క్ష పీఠం కూడా ద‌క్కింది. అయితే.. కొన్నాళ్ల కింద‌ట అంతే అనూహ్యంగా ఆ ప‌ద‌వి నుంచి ప‌క్క‌కు త‌ప్పుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఇక‌, క‌న్నా త‌ప్పుకొన్నాక .. ఈ ప‌ద‌విని  గోదావ‌రి జిల్లాకు చెందిన   మ‌రో కాపు నేత సోము వీర్రాజుకు అప్ప‌గించారు. ఇదిలావుంటే, 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన మెజారిటీ నాయ‌కులు.. ప్ర‌జ‌లు ప‌వ‌న్‌కు స‌పోర్టు చేయ‌డంతోపాటు.. కొంద‌రు వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించారు. మ‌రోవైపు కాపు సామాజిక వ‌ర్గానికే చెందిన ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం.. రిజ‌ర్వేష‌న్ కోసం ప‌ట్టుబ‌ట్టి.. ఉద్య‌మం న‌డిపించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆయ‌న రాష్ట్ర వ్యాప్తంగా మ‌రింత పాపుల‌ర్ అయ్యారు.

ఇదిలావుంటే, తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు.. ముద్ర‌గ‌డ‌తో భేటీ అయ్యారు. బీజేపీ ఎద‌గ‌డంలోను.. ఇత‌ర నేత‌ల‌ను పార్టీలోకి చేర్చుకోవ‌డంలోను, ముఖ్యంగా కాపు సామాజిక వ‌ర్గాన్ని బీజేపీకి చేరువ చేయ‌డంలోను.. ముద్ర‌గ‌డ సాయాన్ని సోము కోరిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే.. ప్ర‌స్తుతం ముద్ర‌గ‌డ‌కు క్షేత్ర‌స్థాయిలో బ‌లం క‌నిపించ‌డం లేదు. కాపు ఉద్య‌మం సాగిన‌న్నాళ్లు ఆయ‌న తిరుగులేని శ‌క్తిగా ఉన్నా.. రిజ‌ర్వేష‌న్ సాధించ‌లేక పోవ‌డం.. ఇటీవ‌ల కాలంలో ఏకంగా కాపు ఉద్య‌మానికే ఫుల్ స్టాప్ పెట్ట‌డం వంటివి ఆ సామాజిక వ‌ర్గం జీర్నించుకోలేక పోతోంది. మ‌రీ ముఖ్యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్  ఎంట్రీతో ఈ వ‌ర్గం ముద్ర‌గ‌డ‌ను దాదాపు ప‌క్క‌న పెట్టింది. అయినా.. బీజేపీ నాయ‌కుడు సోము.. ముద్ర‌గ‌డ‌కు ప్రాధాన్యం ఇస్తుండ‌డం విశేషం. ఈ నేప‌థ్యంలో త్వ‌ర‌లోనే బీజేపీ.. కాపుల పార్టీగా అవ‌త‌రించ‌నుంద‌నే ప్ర‌చారం ఊపందుకుంది. మ‌రి చూడాలి ఏం జ‌రుగుతుందో. 
Tags:    

Similar News