బాబు A1, నారాయణ A 2 అంట !

Update: 2021-03-17 08:30 GMT
ఏపీలో అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబుకి సీఐడీ అధికారులు నిన్న నోటీసులు అందజేసిన సంగతి తెలిసిందే. తాజాగా నేడు మాజీ మంత్రి నారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో నోటీసులను సీఐడీ అధికారులు అందించారు. నారాయణ అందుబాటులో లేకపోవడంతో భార్య రమాదేవికి నోటీసులు అందజేశారు. ఈ నెల 22న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో తెలిపారు. సిఐడి ఇచ్చిన నోటీసుల్లో నారాయణను ఏ-2గా  పొందుపరిచారు.

ప్రతిపక్ష నేత చంద్రబాబుపై నమోదు చేసిన సెక్షన్ల కింద నారాయణపై కూడా కేసులు నమోదు చేశారు. విచారణకు హాజరుకాకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐడీ అధికారులు హెచ్చరించారు. విచారణకు హాజరుకాకపోతే సెక్షన్ 41ఏ(3)(4) కింద నారాయణను అరెస్టు చేసే అవకాశం ఉందని తెలిపారు. ఇదిలా ఉంటే ..  మాజీ మంత్రి నారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరుపుతున్నారు. నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్ సహా మొత్తం 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. నారాయణకు చెందిన కార్యాలయాల్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఏక కాలంలో అన్ని చోట్ల సోదాలు జరుగుతున్నాయి. ఇన్ని చోట్ల ఒకేసారి సోదాలు జరుగుతుండటం సంచలనంగా మారింది.

రాజధాని ప్రాంత రైతుల నుంచి అత్యంత ఖరీదైన భూములను గజం 15 వందలు, 2వేల రూపాయలకే విక్రయించారని, అలా విక్రయించిన భూముల్ని చంద్రబాబు తన అనుచరులకు కట్టబెట్టినట్లు సీఐడీ అధికారులు చెబుతున్నారు. ల్యాండ్‌ సీలింగ్‌ యాక్ట్‌ ప్రకారం రాజధాని భుముల్ని రెసిడెన్షియల్ అవసరాల కోసం వినియోగించకూడదు. కానీ అక్కడ కొంతమందికి లబ్ధి కలిగేలా భూముల్ని అమ్మినట్లు ఏపీ సీఐడీ అధికారులు చంద్రబాబుపై కేసులు నమోదు చేశారు.
Tags:    

Similar News