చిన‌బాబు - పెద‌బాబు...ఎవ‌రేం చెప్పినా న‌మ్మేస్తారా?

Update: 2018-11-01 09:58 GMT
నారా చంద్ర‌బాబు నాయుడు, నారా లోకేష్‌.. ఈ తండ్రీ కొడుకులు మామూలు వ్య‌క్తులు కాదు. తండ్రి ముఖ్య‌మంత్రి. కొడుకు మంత్రి. పెద‌బాబు జాతీయ పార్టీ టీడీపీకి అద్య‌క్షుడు. చిన‌బాబు అదే పార్టీకి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి. అలాంటి వ్య‌క్తులు మాట్లాడేట‌ప్పుడు, ఎవ‌రిపైనైనా నింద‌లు వేసేట‌ప్పుడు ఎంత జాగ్ర‌త్త‌గా ఉండాలి? నిజానిజాల‌ను ఎంత‌లా నిగ్గు తేల్చుకోవాలి. చంద్ర‌బాబు, లోకేష్ మాత్రం ఇవేం ప‌ట్టించుకుంటున్న‌ట్లుగా క‌నిపించ‌ట్లేద‌ని విశ్లేష‌కులు పెద‌వి విరుస్తున్నారు. బాధ్య‌తాయుత‌మైన ప‌ద‌వుల్లో ఉన్న త‌మ నోటి నుంచి వ‌చ్చే ప్ర‌తి మాట‌ను ప్ర‌జ‌లు సీరియ‌స్‌గా తీసుకుంటార‌నే క‌నీస స్పృహ కూడా వారికి ఉన్న‌ట్లు క‌నిపించ‌ట్లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఉక్కు మ‌నిషి స‌ర్దార్ వ‌ల్ల‌భ్‌భాయ్ ప‌టేల్ స్మారకార్థం గుజ‌రాత్‌లోని న‌ర్మ‌దా న‌దీ తీరంలో నిర్మించిన భారీ ఐక్య‌తా విగ్ర‌హాన్ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ బుధ‌వారం ఆవిష్క‌రించారు. ఈ విగ్ర‌హానికి సంబంధించి సోష‌ల్ మీడియాలో జ‌రిగిన ఓ ప్ర‌చారం చంద్ర‌బాబు, లోకేష్‌ల నిర్ల‌క్ష్య వ్య‌వ‌హార శైలిని తేట‌తెల్లం చేసింద‌ని విమ‌ర్శ‌కులు సూచిస్తున్నారు.

అస‌లు విష‌యం ఏంటంటే.. స‌ర్దార్ విగ్ర‌హావిష్క‌ర‌ణ సంద‌ర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫ‌ల‌కంలో తెలుగు భాష‌కు త‌గిన ప్రాధాన్యం ద‌క్క‌లేద‌ని సోష‌ల్ మీడియాలో విస్తృతంగా ప్ర‌చారంలోకి వ‌చ్చింది. శిలాఫ‌ల‌కం ఇదేనంటూ ఓ ఫొటో కూడా వైర‌ల్ అయ్యింది. దీంతో ద‌క్షిణాది భాష‌ల‌కు అందులో ప్రాధాన్యం ద‌క్క‌లేద‌ని ప‌లువురు విమ‌ర్శ‌లు గుప్పించారు. త‌మిళం ఉన్నా.. అది కూడా త‌ప్పుగా రాశార‌ని మండిప‌డ్డారు.

ఈ వ్య‌వ‌హారం వైర‌ల్ కావ‌డంతో చంద్ర‌బాబు, లోకేష్ కూడా స్పందించారు. తెలుగు ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వ అంశాన్ని తెర‌పైకి తెచ్చారు. మోదీపై వ్య‌తిరేక‌త పెంచి.. తెలుగు రాష్ట్రాల్లో త‌మ మైలేజ్ పెంచుకునేందుకు ప్ర‌య‌త్నించారు. ద‌క్షిణాది అంటే మోదీకి చిన్న‌చూపు అని చెప్పేందుకు య‌త్నించారు. దేశంలో అత్యధికులు మాట్లాడే భాషల్లో తెలుగుకి మూడోస్థానం ఉంద‌ని.. అలాంటి తెలుగుకి శిలాఫలకంపై అవకాశం కల్పించకపోవడమేంటని మోదీ స‌ర్కారును త‌మ ట్వీట్ల‌లో గ‌రంగ‌రంగా ప్రశ్నించేశారు.

అయితే, ఇక్క‌డే తండ్రీ కొడుకులు ప‌ప్పులో కాలేశారు. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది ఫేక్‌ ఫొటో కావ‌డ‌మే ఇందుకు కార‌ణం. అస‌లైన శిలాఫ‌ల‌కం ఫొటోను షేర్ చేసిన అధికారులు.. అందులో తెలుగు స‌హా అన్ని ద‌క్షిణాది భాష‌ల‌కు త‌గిన ప్రాధాన్యం ద‌క్కిన‌ సంగ‌తిని సూచించారు. అస‌లు వాస్త‌వం వెలుగులోకి రావ‌డంతో ప్ర‌స్తుతం చంద్ర‌బాబు, లోకేష్‌ల‌పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎవ‌రో ఊరు, పేరు తెలియ‌ని వ్య‌క్తులు ఓ ఫొటో పెట్టి ద‌క్షిణాదికి అన్యాయం జ‌రిగింద‌ని చెప్ప‌గానే.. నిజానిజాలు నిర్దారించుకోకుండానే తండ్రీకొడుకులు రంగంలోకి దిగ‌డ‌మేంట‌ని అంతా ప్ర‌శ్నిస్తున్నారు. తెలుగు ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వ నినాదాన్ని తెర‌పైకి తెచ్చి త‌మ మైలేజ్ పెంచుకునే తొంద‌ర‌లో పెద‌బాబు, చిన‌బాబు క‌నీస ఇంగిత‌జ్ఞానాన్ని మ‌ర్చారంటూ ధ్వ‌జ‌మెత్తారు. స్వ‌యంగా అధినేత‌లే విమ‌ర్శ‌లు గుప్పిస్తుండ‌టంతో టీడీపీలోని ఇత‌ర నేత‌లు కూడా రెచ్చిపోయార‌ని.. ఇష్టారీతిన ఆత్మ‌గౌర‌వ‌మంటూ వ్యాఖ్య‌లు చేశార‌ని సూచించారు.

టెక్నాల‌జీలో నిపుణుల‌మంటూ  ప్ర‌గ‌ల్బాలు ప‌లికే చంద్ర‌బాబు, లోకేష్‌ల‌కు సోష‌ల్ మీడియాలో జ‌రిగే ప్ర‌చార‌మంతా నిజం కాద‌నే వాస్త‌వం కూడా తెలియ‌దా అంటూ నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. బాధ్య‌తాయుత‌మైన ప‌ద‌వుల్లో ఉండి.. ఎవ‌రేం చెప్పిన న‌మ్మ‌డ‌మేనా అని నిల‌దీస్తున్నారు. దేశ రాజ‌కీయాల్లో త‌న‌ను మించిన సీనియ‌ర్ లేనే లేడ‌ని.. మైక్రోసాఫ్ట్ సీఈవో స‌త్య నాదెళ్ల‌కు కూడా కంప్యూట‌ర్ తానే నేర్పించాన‌ని చెప్పుకు తిరిగే చంద్ర‌బాబు ఇలా చేయ‌డం సిగ్గు చేట‌ని విమ‌ర్శిస్తున్నారు. నిజానిజాలు తేల్చుకునే తీర‌క‌, క‌నీస ప‌రిజ్ఞానం కూడా లేని టీంల‌తో చంద్ర‌బాబు, లోకేష్ నెట్టుకొస్తున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు.
Tags:    

Similar News