వలసలు ఎలా ఆపుదాం!? 'దేశం' అంతర్మధనం

Update: 2019-02-16 05:36 GMT
తెలుగుదేశం పార్టీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత వారం రోజులుగా పార్టీ నుంచి వలసల పర్వం ప్రారంభమైంది. ఇప్పటికే సీనియర్ నాయకులు - ప్రజా ప్రతినిధులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మరికొందరు కూడా ఆ దారిలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మరో మూడు నెలల్లో లోక్ సభకు - ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఎలా అంచనా వేయాలో తెలియక చంద్రబాబుతో సహా సీనియర్ నాయకులు అందరూ మదన పడుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం నాడు తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఆంధ్ర ప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాలకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అందరూ వస్తున్నారు.

తెలంగాణ ముందస్తు ఎన్నికల లో జరిగిన ఘోర పరాభవం - ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఎన్నికలు జరగనుండటం తెలుగుదేశం పార్టీ అంతర్మధనానికి వేదిక కానున్నాయి. తన ముందు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసిన తెలుగుదేశం పార్టీ పూర్తిస్థాయిలో నష్టపోయింది. అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ లో విడిగానే పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. తమతో కలిసి వచ్చే పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో లేకుండా పోయాయని తెలుగుదేశం పార్టీ అంచనా వేస్తోంది. ఈ పరిణామాలపై చర్చించడంతో పాటు పార్టీ నుంచి భారీగా వస్తున్న వలసలను నియంత్రించడం పై దృష్టి పెట్టాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. వివిధ జిల్లాల్లో గ్రూపులుగా ఏర్పడిన తెలుగు తమ్ముళ్ళను ఏకం చేసే బాధ్యతను కూడా పార్టీ సీనియర్లకు అప్పగిస్తూ పోలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. చాలా కాలం తర్వాత జరుగుతున్న తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సమావేశం ఈ పరిణామాల నేపథ్యంలో అత్యంత కీలకంగా మారనుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ సీనియర్ నాయకులతో చర్చించి గ్రూపు తగాదాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. అయినా... ఏ జిల్లాలోను ఆయన మాటను తెలుగు తమ్ముళ్లు లక్ష్యపెట్టడం లేదు. ఇది చంద్రబాబు నాయుడికి ఒక విధంగా గడ్డుకాలమేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. శనివారం నాటి పొలిట్ బ్యూరో సమావేశంలో ఈ అంశాలపై తీవ్ర చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు.


Tags:    

Similar News