పట్టు మీద ఉంది.. ముదిరి పాకాన పడుతోంది..

Update: 2022-01-31 15:30 GMT
ప్రభుత్వ ఉద్యోగులు వర్సెస్ మంత్రులు. ఇది కొత్త ఎపిసోడ్. ఉద్యోగులలో చీలికకు మంత్రులు ప్రయత్నం చేస్తున్నారా. చర్చల పేరిట వారికి  పిలుస్తూ వారు రాలేదని మరో వైపు చెబుతూ ఉద్యోగుల మీద జనాల్లో ఆగ్రహం పెరిగేలా చూస్తున్నారా. ఇది ఉద్యోగుల వైపు భావన అయితే మంత్రుల వైఖరి మరోలా ఉంది. ఉద్యోగులు మాటలు మీరుతున్నారని, ఏకంగా తమనే టార్గెట్ చేస్తున్నారని కస్సుబుస్సులాడుతున్నారు. ఒక వైపు సమ్మెకు కౌంట్ డౌన్ పడుతున్న వేళ ప్రభుత్వ ఉద్యోగులు మంత్రుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

మరో వైపు కొత్త జీతాలను తాము అనుకున్న ప్రకారం ఇవ్వాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. కానీ దానికి మెజారిటీ ఉద్యోగులు సహకరించడం లేదు. చాలా చోట్ల ట్రెజరీలలో చూస్తే తక్కువ మంది ఉద్యోగులే జీతాలను ప్రాసెస్ చేస్తున్నారు. ఫస్ట్ తేదీకి టైమ్ తక్కువగా ఉన్నా కూడా జీతాల ప్రాసెస్ అన్నది వేగంగా జరగకపోవడంతో ప్రభుత్వ పెద్దలు ఇక కఠిన వైఖరినే అవలంబిస్తున్నారు. ఏకంగా 27 మంది అధికారులకు మెమోలు కూడా జారీ చేశారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధ‌మవుతోంది.

మరో వైపు చూస్తే ఎలాగైనా ఎక్కువ మందికి ఫిబ్రవరి ఫస్ట్ న జీతాలు ఇవ్వాలని సర్కార్ భావిస్తోంది. ఆ బాధ్యతను జిల్లా కలెక్టర్ల మీద పెట్టింది.  దాంతో ఏ జిల్లాకు ఆ జిల్లా కలెక్టర్లు రంగంలోకి దిగి మొత్తం జీతాల ప్రాసెస్ ని మానిటరింగ్ చేస్తున్నారు. ఇంకో వైపు చూసుకుంటే కొత్త జీతాలను ఇవ్వడం ద్వారా జీతాలు ఏ విధంగా పెరిగాయో ఉద్యోగుల కళ్లకు కట్టినట్లుగా చూపించాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యంగా ఉంది.

దాంతో పాత జీతాలనే తాము తీసుకుంటామని, అలాగే చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. తమకు అదే సమ్మతమని కూడా తెలియచేస్తున్నారు. ఈ విషయంలో రెచ్చగొట్టుడు వైఖరి మంచిది కాదు అంటున్నారు. సరిగ్గా ఈ సమయంలో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగారు. ఆయన ఈసారి మరింత ఘాటుగా ఉద్యోగ సంఘాల నేతలను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు.

చర్చలకు పిలిస్తే రారు, ద్వితీయ శ్రేణి నాయకులను పంపుతారు, మరి చర్చలు జరగకపోతే సమస్యలు పరిష్కారం ఎలా అని బొత్స ప్రశ్నిస్తున్నారు. ఇంకో వైపు చూస్తే మంత్రులే ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య ఇబ్బందులు సృష్టిస్తున్నారు అన్న కామెంట్స్ మీద కూడా బొత్స గట్టిగా రియాక్ట్ అయ్యారు. ఇలాంటి మాటలు ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడం తగదని కూడా ఆయన అంటున్నారు. అలాగే ఉద్యోగ సంఘాల నేతలలో చీలిక  తేవడానికి చూస్తున్నారు అన్న ఆరోపణలను కూడా ఖండించారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మీద అనుచితమైన కామెంట్స్ ని ఉద్యోగులు చేస్తున్నారని, వెంటనే అది మానుకోవాలని, లేకపోతే దానికి ఉద్యోగ సంఘాల నేతలదే బాధ్యతగా చూస్తామని కూడా బొత్స చెప్పడం విశేషం. అలాగే జీవో కొత్త పీయార్సీ మీద జారీ చేసినపుడు ఆ జీతాలే వస్తాయి తప్ప పాత జీతాలు ఎలా వస్తాయని బొత్స లాజిక్ పాయింట్ తీస్తున్నారు.

ఇక ఉద్యోగులు చర్చలకు రావాలని, అదే సమయంలో గొంతెమ్మ కోరికలు కోరరాదని మంత్రి గారు కండిషన్ పెట్టేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులు తమ డిమాండ్లు వినిపించాలని కోరుతున్నారు. మొత్తానికి చూస్తూంటే సమ్మె కచ్చితంగా ఆరు రోజులకు వచ్చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు అటు పంతం మీద ఉంటే ఇటు ప్రభుత్వం కూడా గట్టిగానే రియాక్ట్ అవుతోంది. చూడాలి మరి ఈ గ్యాప్ ఎపుడు సర్దుకుంటుందో చర్చలు ఎపుడు స్టార్ట్ అవుతాయో.
Tags:    

Similar News