అగ్రవర్ణాల విషయంలో కీలక నిర్ణయం

Update: 2021-07-15 05:13 GMT
ఇంతకాలం పేదలంటే రిజర్వేషన్ క్యాటగిరీల్లోనే ఉంటారనే భావనలో నుండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బయటపడింది. అగ్రవర్ణాల్లో కూడా పేదలున్నారన్న విషయాన్ని జగన్ గుర్తించారు. అందుకనే ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు (ఇడబ్ల్యూఎస్) విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కేటాయించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథదకాల్లో  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటి, మహిళలకు పెద్ద పీట వేసిన సంగతి తెలిసిందే.

ఏ పథకం అమలుచేసినా, ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా కేవలం పై వర్గాలు మాత్రమే లబ్దిపొందుతున్నాయి. దాంతో అగ్రవర్ణాల్లోని పేదల్లో ప్రభుత్వంపై మంట మొదలైంది. ఓట్లను దృష్టిలో పెట్టుకునే జగన్ పై వర్గాలను మాత్రమే దగ్గరకు తీసుకుంటున్నారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఈ నేపధ్యంలో వివిధ మార్గాల్లో వస్తున్న ఫీడ్ బ్యాక్ ఆధారంగా అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని జగన్ నిర్ణయించారు. వెంటనే బుధవారం రాత్రే దీనికి అవసరమైన జీవో కూడా రిలీజ్ చేసేశారు.

జీవో ప్రకారం ఏడాదికి రు. 8 లక్షల ఆదాయం ఉన్నవారంతా 10 శాతం రిజర్వేషన్ కోటాక్రిందకు వచ్చేస్తారు. జీతం, వ్యవసాయం, వ్యాపార, వృత్తిలో ఉన్నా పర్వాలేదు వార్షిక ఆదాయం రు. 8 లక్షల లోపుంటే చాలు. ఇందులో కూడా మళ్ళీ ప్రత్యేకంగా మూడోవంత మహిళలకు కేటాయిస్తున్నట్లు జీవోలో ప్రభుత్వం చెప్పింది.

నిజానికి ఇడబ్ల్యూఎస్ కోటా రిజర్వేషన్ విషయంలో నరేంద్రమోడి సర్కార్ 2019లోనే జీవో ఇచ్చింది. ఆ ఉత్తర్వులను యధాతథంగా అమలు చేయకుండా ఇందులో 5 శాతం కాపులకు ప్రత్యేకంగా కేటాయించినట్లు అప్పట్లో చంద్రబాబునాయుడు ప్రకటించారు. నిజానికి కేంద్రం నిర్ణయానికి విరుద్ధం. చంద్రబాబు నిర్ణయం అమలు కావాలంటే చట్ట సవరణ చేయాల్సిందే. అందుకనే అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదం కోసం కేంద్రానికి పంపారు.

అయితే ఆ తీర్మానాన్ని కేంద్రం తిప్పికొట్టింది. దాంతో అసలు కేంద్ర నిర్ణయమే అమల్లోకి రాలేదు. తర్వాత ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వచ్చినా ఎందుకనో కేంద్రం నిర్ణయంపై స్పందించలేదు. ఇంతకాలానికి అగ్రవర్ణాల్లో 10 శాతం రిజర్వేషన్ అమలుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. దీని కారణంగా అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా ప్రభుత్వ సాయం అందుతుంది.
Tags:    

Similar News