మిషన్ బిల్డ్ ఏపీ .. ఆ ఐఏఎస్ పై కేసు నమోదు చేయండి , హైకోర్టు సంచలన తీర్పు !

Update: 2020-12-30 11:57 GMT
మిషన్ బిల్డ్ ఏపీ కేసులో ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలను జారీ చేసింది. కేసుకు సంబంధించి తప్పుడు అఫిడవిట్ సమర్పించారంటూ బిల్డ్ ఏపీ అధికారి ప్రవీణ్ కుమార్ పై తీవ్ర అసహనం , ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ధిక్కారం కింద, క్రిమినల్ ప్రాసిక్యూషన్ కింద కేసులు నమోదు చేయాలని జ్యుడీషియల్ కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది.

భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించింది. ప్రభుత్వం న్యాయ ప్రక్రియలో జోక్యంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వం వేసిన రిక్విజల్ పటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణను ఫిబ్రవరి 2వ తేదీకి వాయిదా వేసింది. మిషన్ బిల్డ్ ఏపీ పథకం కింద ప్రభుత్వ భూములను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రక్రియను సవాలు చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. విశాఖ, గుంటూరు జిల్లాల్లోని తొమ్మిది ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాల్ని ఈ-వేలం ద్వారా విక్రయించే యత్నాన్ని సవాలు చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ల విచారణ నుంచి జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ తప్పుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు మిషన్ ఆఫ్ ఏపీ ప్రత్యేకాధికారి ప్రవీణ్‌కుమార్ ఈ అఫిడవిట్ దాఖలు చేశారు.
Tags:    

Similar News