రాజధానిపై తేల్చాలన్న ఏపీ హైకోర్టు

Update: 2019-10-25 06:57 GMT
ఏపీ హైకోర్టు సీరియస్ అయ్యింది. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో జరుగుతున్న జాప్యాన్ని ప్రశ్నిస్తూ వ్యాఖ్యలు చేసింది. పనుల కోసం మరెంత కాలం వెయిట్ చేయాలని ప్రశ్నించిన కోర్టు.. కాస్తంత ఘాటుగా రియాక్ట్ అయ్యింది. తమకు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నదన్నది తమకు అవసరం లేదని.. పనులు పూర్తి చేస్తారా? చేయరా? అన్నది మాత్రమే తమకు ముఖ్యమని పేర్కొంది.

ఇంతకీ హైకోర్టు ఎందుకిలా మాట్లాడింది? అన్న విషయంలోకి వెళితే.. అమరావతి నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఈ కేసుల్ని విచారించిన కోర్టు.. స్విస్ ఛాలెంజ్ విధానాన్ని ప్రభుత్వం సమీక్షిస్తుందని.. పనులు పూర్తి కావటానికి కొంత సమయం పడుతుందని ప్రభుత్వ తరఫు న్యాయవాది వ్యాఖ్యానించారు.

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. జడ్జీలు గెస్ట్ హౌస్ లలో తలదాచుకుంటున్నారని.. వారికి కనీసం క్వార్టర్లు కూడా నిర్మించలేదని.. న్యాయవాదులకు కనీస సదుపాయాలు లేవని.. కనీసం తాగేందుకు టీ కూడా దొరక్క న్యాయవాదులు ఇబ్బందులకు గురవుతున్నారంది.

ఇంకా ఎంతకాలం వెయిట్ చేయాలి?  పనులు మీరు చేస్తారా? మమ్మల్ని ఆదేశించమంటారా? అని ప్రశ్నించింది. రాజధాని నిర్మాణం.. స్విస్ ఛాలెంజ్ పద్ధతులపై వారంలో తేల్చి చెప్పాలంటూ ఆదేశాలు జారీ చేసింది. పనులు నిలిచిపోవటంతో హైకోర్టులో సమస్యలు నెలకొన్నాయని.. కార్లు పెట్టుకోవటానికి..కనీసం కూర్చునేందుకు సైతం జాగా లేదని కోర్టు పేర్కొంది. సమస్యల మీద ప్రతి రోజు తమకు ఫిర్యాదు వస్తున్నాయని.. ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందో తమకు స్పష్టం చేయాలని.. లేదంటే తామే ఆదేశాలు జారీ చేస్తామని ప్రకటించింది. మరి.. దీనిపై ఏపీ సర్కారు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Tags:    

Similar News