జగన్ సర్కారు సై అంటున్న జీపీఎస్ కు.. సీపీఎస్ కు తేడా ఏంది?

Update: 2022-04-26 04:37 GMT
నిత్యం ఏదో ఒక ఇష్యూను నెత్తిన ఎత్తుకోకుండా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిమ్మళంగా నాలుగు నెలలు పాటు పాలన చేయరా? అన్న మాట తరచూ పలువురి నోట వినిపిస్తూనే ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక అంశం మీద లొల్లి జరుగుతూ ఉండటం.. ఆ అంశం ఒక కొలిక్కి వచ్చిందన్నంతనే మరో ఇష్యూ మీదకు వచ్చేయటం జగన్ సర్కారుకు ఒక అలవాటుగా మారింది. తాజాగా కాంట్రిబ్యూటరీ పింఛన్ పథకం (సీపీఎస్)ను రద్దు చేయాలని ఉద్యోగ.. ఉపాధ్యాయ సంఘాలన్ని డిమాండ్ చేయటం.. సోమవారం సీఎంవో ముట్టడికి తీవ్ర ప్రయత్నం చేయటం.. భారీగా పోలీసు బలగాల్ని దించిన ప్రభుత్వం.. ఆ నిరసనను బయటకు రాకుండా కట్టడి చేయటంలో సక్సెస్ అయ్యింది.

అదే సమయంలో సీపీఎస్ రద్దు స్థానే జీపీఎస్ (గ్యారంటీడ్ పింఛన్ పథకం)ను తీసుకొస్తామని చెబుతోంది. దీనికి ఉద్యోగులు మాత్రం ససేమిరా అంటున్నారు. విపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమకు ఏదైతే చెప్పారో.. అదేరీతిలో సీపీఎస్ ను రద్దు చేసేసి.. పాత విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నారు. పాత పింఛన్ విధానాన్ని యథాతధంగా అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అందుకు ప్రభుత్వం సానుకూలంగా లేదనే చెప్పాలి.

ఇంతకీ సీపీఎస్ స్థానే జగన్ సర్కారు తెస్తామని చెబుతున్న జీపీఎస్ లో ఏముంది? ఉద్యోగులు.. ఉపాధ్యాయులు ససేమిరా అంటూ పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. పాత పింఛన్ విధానంలో ఉన్న సౌకర్యాలు.. సౌలభ్యాలు జగన్ సర్కారు తాజాగా తీసుకొచ్చిన జీపీఎస్ లో లేవని స్పష్టం చేస్తున్నారు. అయితే.. పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలంటే.. భారీ ఎత్తున నిధులు అవసరమని.. ఇప్పుడు పరిస్థితుల్లో ఆ భారాన్ని మోయలేమని ప్రభుత్వం చెబుతోంది.

విపక్షంలో ఉన్నప్పుడు జగన్ గొప్పగా సీపీఎస్ రద్దు చేస్తామని.. పాత విధానాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారని ఉద్యోగ.. ఉపాధ్యాయ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. జగన్ ప్రభుత్వం ఇప్పుడు చెబుతున్న జీపీఎస్ పద్దతితో పోలిస్తే.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు టక్కర్ కమిటీని ఏర్పాటు చేసి.. వారు చెప్పినట్లుగా 50 శాతం పింఛన్ పథకాన్ని తీసుకొచ్చినా తాము రిజెక్టు చేశామంటున్నారు. టక్కర్ కమిటీ కంటే కూడా తక్కువగా జీపీఎస్ ఉండటాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో పాత పింఛను పథకాన్ని అమలు చేయటం ఆచరణ సాధ్యం కాదని తేల్చేశారు మంత్రి ముగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.

పాత పింఛన్ విధానం అమలు దేశ వ్యాప్తంగా పెద్ద సవాలుగా మారిందని.. దాని స్థానే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్ విధానాన్ని అమలు చేయటానికి పలు ప్రభుత్వాలు మొగ్గు చూపుతున్నాయన్న మాట వినిపిస్తోంది. ఇంతకీ పాత పింఛన్ విధానంలో ఏముంది? కొత్తగా తీసుకొస్తామని చెబుతున్న జీపీఎస్ విధానంలో ఏముందన్న విషయాన్ని చూస్తే.. ఉద్యోగ.. ఉపాధ్యాయ సంఘాలు ఎందుకు వద్దాయన్నది ఇట్టే అర్థమవుతుందని చెబుతున్నారు.

పాత పింఛన్ (ఓపీఎస్) విధానంలో..

 - ఉద్యోగి తన సర్వీసు కాలంలో ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అందుకు భిన్నంగా ఉద్యోగి తన జీతంలో పది శాతం వరకు ఇవ్వాల్సి వస్తోంది.

-  ఉద్యోగి పదవీ విరణమ తర్వాత.. పెద్ద వయసులో సామాజిక భద్రత ఉంటుంది. పింఛను బాధ్యత ప్రభుత్వమే చూసుకుంటుంది.

-  ద్రవ్యోల్బణం పెరిగినప్పుడల్లా డీఏ పెంపు.. పీఆర్సీ వర్తించి.. పింఛన్ పెరుగుతుంది.

-  70 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి అదనపు క్వాంటం పింఛన్ ఇస్తారు.

-  హెల్త్ కార్డుల్ని ఇచ్చి.. వాటి ద్వారా వైద్యం చేయిస్తారు

-  ఉద్యోగికి పీఎఫ్ ఖాతా ఉంటుంది.

- కమ్యుటేషన్.. గ్రాట్యుటీ కూడా ఉంటుంది.

ప్రభుత్వ తెస్తానని చెబుతున్న జీపీఎస్ విధానంలో..

-  ఉద్యోగి తన వాటాను ప్రతి నెలా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది.

-  సీపీఎస్ లో ఉద్యోగి పదవీ విరమణ పొందిన తర్వాత దగ్గర దగ్గర 20.3 శాతం పింఛను వస్తున్నట్లుగా లెక్క తేల్చారు. దాన్ని 33 శాతానికి పెంచి ఇస్తామన్న దప్రభుత్వప్రతిపాదన.

-  డీఏ పెంపుపై క్లారిటీ లేదు

- పీఆర్సీ వర్తిస్తారా? లేదా? అన్న దానిపై స్పష్టత కరవు

-  అదనపు క్వాంటం పింఛన్.. హెల్త్ కార్డులపై హామీ లేదు

- పీఎఫ్ ఖాతా ఉండదు

- కమ్యుటేషన్ ఉండదు

- గ్రాట్యూటీపై స్పష్టత లేదు.
Tags:    

Similar News