చంద్రబాబు భజన బృందంలో ఎన్జీవోలు

Update: 2016-10-24 11:21 GMT
కార్యనిర్వాహక వ్యవస్థ రాజకీయవ్యవస్థ దారిలోనే సాగుతోంది... నిండా రాజకీయాలను ఒంటబట్టించుకుని నవ్వుల పాలవుతోంది. ఏ ఎండకా గొడుకు పడుతూ అధికారంలో ఉన్నవారి పంచన చేరుతోంది. ప్రభుత్వం మారగానే పార్టీ మార్చేసిన నాయకులున్నట్లే ఉద్యోగులు కూడా ప్లేటు ఫిరాయించేస్తున్నారు. ఉద్యోగుల ప్రయోజనాలనూ పక్కనపెట్టి ప్రభుత్వాలకు వంత పాడుతున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ లో ఏపీ ఎన్జీవోల తీరు ఇలాగే ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మనసెరిగి మసలుకోవడంపైనే వారంతా దృష్టి పెడుతున్నారు. అత్యంత బలమైన ఉద్యోగ సంఘంగా పేరున్న ఏపీ ఎన్జీఓల సంఘం ముఖ్యమంత్రి చెప్పుచేతల్లోకి వెళ్లిపోయినట్లుగా కనిపిస్తోంది.

సమైక్యాంధ్ర ఉద్యమంలో చొక్కాలు చించుకుని పోరాడిన ఏపీ ఎన్జీవోల నేతలు ప్రజల మనసులు చూరగొన్నారు. కానీ... ఇప్పుడు వారే ఉద్యోగులతో వీరేం నాయకులు అనిపించుకుంటున్నారు. అప్పట్లో ప్రభుత్వాలపై దుమ్మెత్తిపోసిన ఎన్జీఓలు ఇపుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నా నోరు మెదపడం లేదు. కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే ఉద్యోగ వ్యతిరేక విధానాలపై స్పందించడమే మరిచిపోయారు. ఉద్యోగుల విషయంలోనే కాదు…రాష్ట్ర ప్రయోజనాల అంశంలోనూ ఎన్జీఓలు మౌనం దాల్చడం వెనుక చంద్రబాబు నాయుడి ఆదేశాలే పనిచేస్తున్నాయని అంతా చెవులు కొరుక్కుంటున్నారు.

రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఊరూ - వాడ అంతా ఉద్యమపథాన నడిపించిన ఎన్జీఓ సంఘం నేతలు ఇపుడు ప్రత్యేక హోదా విషయంలో నోరు మెదపలేదు. రాష్ట్రానికి జరిగే అన్యాయం విషయంలో ఎక్కడా బయటికి వచ్చి మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు కేంద్రంపట్ల ఎలాంటి వైఖరితో ఉంటున్నారో…అదే విధమైన విధానాన్ని ఏపీ ఎన్జీఓలుకూడా అనుసరిస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమమే ఎన్జీఓలను నిలబెట్టింది. ముఖ్యమంత్రికి దగ్గర చేసింది. కేవలం ఎన్జీఓలు ఒక్కరే ఉద్యమం చేయలేదు. అన్ని వర్గాలకు చెందిన వారు సమైక్యాంధ్రాకు అనుకూలంగా పోరాడారు. కానీ ఫలితాలు మాత్రం ఏపీ ఎన్జీఓలకు దక్కాయి. అయినా సరే ప్రజలు ఏమాత్రం నిరాశ చెందలేదు. అసంతృప్తికి గురవ్వలేదు. సమైక్యాంధ్రా ఉద్యమ నేపథ్యం తెలిసిన ఎవరైనా సరే ఇపుడు ఎన్జీఓలు అనుసరించే విధానం చూసి విస్తుపోతున్నారు. అటు రాష్ట్ర ప్రయోజనాలనూ,ఇటు ఉద్యోగుల మంచిచెడులనూ గాలికి వదిలేసి…ముఖ్యమంత్రి భజనకే పరిమితమైన ఎన్జీఓ నేతల తీరుపై ఉద్యోగులు - రాష్ట్ర ప్రజలు ఆగ్రహిస్తున్నారు. ఉద్యోగులంటే పనిచేసుకుని పోవడమే కాదు... ప్రభుత్వాలను ప్రజల ప్రయోజనాలు నెరవేర్చేవిగా దిశానిర్దేశం చేసేవారిగా ఉండాలన్న విషయం మరిచి భజన బృందాలుగా మారుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News