ముద్ర‌గ‌డ‌..పోలీసులు..ఓ ఉత్కంఠ‌

Update: 2017-08-07 09:52 GMT
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, ఏపీ పోలీసుల ప‌ర‌స్ప‌ర విఫ‌ల‌య‌త్నాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. ముద్రగడ పద్మనాభం అప్రకటిత గృహ నిర్బంధం కొనసాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ రోజు కూడా పాదయాత్రను ప్రారంభించేందుకు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ప్రయత్నించారు. పాదయాత్ర ప్రారంభించేందుకు తన నివాసం నుంచి ఆయన బయటకు వచ్చారు. అయితే పాదయాత్రకు అనుమతి లేదంటూ కాపు ఉద్యమనేతను పోలీసులు ఇంటి గేటు వద్ద అడ్డుకుని లోనికి పంపేశారు.

మ‌రోవైపు ఆదివారం సైతం ఇలాంటి ప‌రిణామామే చోటుచేసుకుంది. య‌థావిధిగా కిర్లంపూడిలోని తన నివాసం నుండి బయటకు వచ్చేందుకు ముద్ర‌గ‌డ చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఇంటి నుండి గేటు వరకు కాపు జేఏసీ నేతలతో కలసి పాదయాత్ర చేసేందుకు వెళ్తుండగా సాయుధ బలగాలు అడ్డుకున్నాయి. దీంతో ముద్రగడ తదితరులు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలియజేశారు. ప్రత్తిపాడు, కిర్లంపూడి పరిసరాల్లోని సుమారు 20గ్రామాలకు చెందిన ప్రజలు ముద్రగడ నివాసానికి తరలివచ్చారు. అలాగే 13జిల్లాలకు చెందిన దళిత నాయకులు ముద్రగడను కలిశారు. చంద్రబాబు ప్రభుత్వ దమనకాండకు వ్యతిరేకంగా దళితులు, కాపులు కలసి ముందుకుసాగాలని ముద్రగడ పిలుపునిచ్చారు. పెద్దాపురం నియోజకవర్గ వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి తోట సుబ్బారావునాయుడు ముద్రగడను కలసి మద్దతు పలికారు. కాపు జేఏసీ నేతలు మధ్యాహ్నం ఖాళీ కంచాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రత్తిపాడు - గొల్లప్రోలు - పిఠాపురం - పెద్దాపురం మండలాలకు చెందిన కాపు ప్రతినిధులతో ముద్రగడ సమావేశం కాగా..  ప్రతి రోజూ రాత్రి సమయాల్లో కొవ్వొత్తుల ప్రదర్శనలకు ముద్రగడ పిలుపునిచ్చారు.

ఇదిలాఉండ‌గా...రాబోయే అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా కాపుల రిజ‌ర్వేష‌న్ బిల్లును ఏపీ ప్ర‌భుత్వం స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప‌రంగా విధివిధానాల క‌స‌ర‌త్తు జ‌రుగుతోంద‌ని తెలుస్తోంది.
Tags:    

Similar News