విశాఖ పిలుస్తోంది...క్యూ కట్టేస్తున్నారు

Update: 2022-12-11 02:30 GMT
విశాఖ అందమైన సిటీ అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. సిటీ ఆఫ్ డెస్టినీ అని అంటారు. విశాఖను ఒక్కసారి చూడాలనుకునే వారు కో కోల్లలుగా ఉన్నట్లే విశాఖ నుంచి రాజకీయం చేయాలనుకునే వారు కూడా ఎంతో మంది ఉన్నారు. ప్రతీ ఎన్నికకూ ఔత్సాహికులతో పాటు అనేక మంది విశాఖ వైపే ఫస్ట్ చూస్తారు.

ప్రస్తుతం జరుగుతున్న చర్చ అంతా విశాఖ ఎంపీ సీటు గురించే. ఈ సీటు ప్రతిష్టాత్మకమైనది. ఇక్కడ నుంచి ఉద్ధండులు ఎంపీలుగా నెగ్గారు. ఢిల్లీలో అనేక కీలకమైన పదవులు చేపట్టారు. నెల్లూరు నుంచి వచ్చిన మాజీ సీఎం నేదురుమల్లి జనార్ధనరెడ్డి, ప్రకాశం జిల్లాకు చెందిన దగ్గుబాటి పురంధేశ్వరి, కె హరిబాబు, నెల్లూరు బిడ్డ టీ సుబ్బరామిరెడ్డి విశాఖ నుంచి ఎంపీలుగా నెగ్గారు. 2019లో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎంవీవీ సత్యనారాయణ ఎంపీ అయ్యారు.

దాంతో 2024 ఎన్నికల కోసం స్థానికేతరులు చాలా మంది కర్చీఫ్ వేసేశారు. మూడు దశాబ్దాలుగా విశాఖ ఎంపీ సీటు నాన్ లోకల్స్ కే రిజర్వ్ అయిపోయింది. దాంతో ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారంతా విశాఖ ఎంపీలుగా గెలిచి ఒక వెలుగు వెలిగారు. బహుశా ఆ ధీమా కావచ్చు విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తాను అంటున్నారు అనంతపురం జిల్లాకు చెందిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ. ఆయన దేశంలో అనేక రాష్ట్రాలలో పనిచేశారు.

ఆయనకు పాపులారిటీ ఉంది. రాజ్యాంగం ప్రకారం ఎక్కడైనా పోటీ చేయవచ్చు. అందుకే ఆయన 2019 ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేసి మంచి ఓట్లు తెచ్చుకున్నారు. ఈసారి కచ్చితంగా పోటీ విశాఖ నుంచే అని చెప్పేశారు. ఇక జీవీఎల్ నరసింహారావు విశాఖ నుంచి పోటీ అంటున్నారు. ఆయన బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు. 2023లో ఆయన రాజ్యసభ సభ్యత్వం ముగుస్తోంది. దాంతో పార్టీ ఆయన్ని ఒక సేఫెస్ట్ సీటుని చూసుకోమని చెప్పింది. ఆయన ఏడాది కాలంగా విశాఖ మీద దృష్టి పెట్టి అక్కడ తన రాజకీయ కార్యకలాపాలను పెంచేశారు.

విశాఖ సమస్యలనే ఆయన పార్లమెంట్ లో ప్రస్తావిస్తున్నారు. విశాఖలో ఏకంగా ఒక క్యాంప్ ఆఫీస్ తెరచి మరీ నెలలో కొన్ని రోజులు అక్కడే ఉంటున్నారు. బీజేపీ తరఫున తాను పోటీకి రెడీ అని ఆయన చెబుతున్నారు. కేంద్ర పెద్దలతో మంచి రిలేషన్స్ ఆయనకు ఉన్నాయి. ఇక విశాఖలో ఆయన సామాజికవర్గం ఓట్లు కూడా బాగానే ఉన్నాయి. దాంతో జనసేనతో పొత్తు ఉంటే గెలుపు ఖాయమని లెక్కలేసుకుని మరీ బరిలోకి దిగాలనుకుంటున్నారు. ఈయన ప్రకాశం జిల్లాకు చెందిన వారు.

మరో వైపు మాజీ ఎంపీ దివంగత ఎంవీవీఎస్ మూర్తి మనవడు శ్రీ భరత్ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయాలనుకుంటున్నాను. తనకు టికెట్ కన్ ఫర్మ్ అవుతుంది అన్న ఆశాభావంతో ఆయన ఉన్నారు. అయితే టీడీపీ నుంచి మరి కొన్ని బిగ్ షాట్స్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వారిలో ఇతర జిల్లాలకు చెందిన వారు సైతం ఉన్నారు. వైసీపీ నుంచి కూడా ఇతర జిల్లాలకు చెందిన వారు విశాఖ సీటు మీద మోజు పడుతున్నారని టాక్.

ఇక కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి కూడా విశాఖ నుంచి మరోసారి పోటీకి రెడీ అంటున్నారు. జనసేన నుంచి కూడా కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. విద్యావంతులకు మేధావి వర్గానికి విశాఖ సీటుని ఇవ్వాలని ఆ పార్టీ ఆలోచన చేస్తోంది. దాంతో వేరే జిల్లాల వారు కూడా విశాఖ నాన్ లోకల్స్ కి గేట్ వే కాబట్టి హ్యాపీగా ల్యాండ్ కావాలనుకుంటున్నారు.

మొత్తానికి విశాఖ పిలుస్తోంది. నేతలు కూడా క్యూ కట్టేస్తున్నారు. అయితే అంతర్లీనంగా ఈసారి లోకల్ కే టికెట్ అన్నది అన్ని పార్టీలలోని నేతల నుంచి వినిపిస్తోంది. అయితే దీన్ని ఆయా పార్టీల పెద్దలు ఎంతవరకూ పట్టించుకుంటారన్నది చూడాల్సి ఉంది. ప్రతీ ఎన్నికలోనూ ఇదే విధమైన నినాదం వస్తుంది కాబట్టి లైట్ తీసుకున్నా తీసుకుంటారని అంటున్నారు. సో విశాఖ మాత్రం పొలిటికల్ లీడర్స్ కి ఇపుడు హాట్ ఫేవరేట్ గా ఉంది అని చెప్పాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News