అపోలో ఆస్పత్రుల చైర్మన్ ప్రతాప్ రెడ్డికి శుక్రవారం అర్ధరాత్రి చెన్నైలో హఠాత్తుగా తీవ్రమైన గుండెపోటు వచ్చింది. చెన్నైలోని స్వగృహంలో ఉన్న ప్రతాప్ రెడ్డి హఠాత్తుగా అస్వస్థతకు గురవడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. దీంతో, ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన అపోలో ఆసుపత్రికి తరలించారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ప్రతాప్ రెడ్డిని ప్రత్యేక వార్డుకు తరలించారు. నిపుణులైన డాక్టర్ల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. ప్రస్తుతం ప్రతాప్ రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెన్నై అపోలో వైద్యులు శనివారం ఉదయం వెల్లడించారు. తమ పర్యవేక్షణలో ఆయనకు ఉత్తమమైన చికిత్స అందిస్తున్నామని వారు తెలిపారు.
కాగా, కొద్ద రోజుల క్రితం అపోలో సంస్థలకు సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతాప్ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చికిత్స అందించిన వివరాలను ఆర్ముగస్వామి కమిషన్ కు అందజేశామని తెలిపారు. అయితే, చికిత్స సమయంలో అమ్మ సీసీటీవీ కెమెరాలను జయ అనుచరులు ఆఫ్ చేశారని తెలిపారు. అందువల్ల సీసీటీవీ ఫుటేజ్ ను కమిషన్ కు సమర్పించడం వీలుకాలేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.