తొలిరోజే చుక్క‌లు చూపించిన ఐఫోన్ X!

Update: 2017-11-04 09:40 GMT
కొద్ది రోజుల నుంచి మొబైల్ వినియోగ‌దారుల‌ను ఊరిస్తోన్న ఐఫోన్ X నిన్న మార్కెట్ లో కి విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఫేస్ ఐడీతో ఫోన్ అన్ లాక్ చేసుకునే సౌక‌ర్యం, 2436 X 1125  రెజుల్యూష‌న్ ఉన్న 5.8 అంగుళాల ఓఎల్ ఈడీ స్క్రీన్, డాల్బీ విజ‌న్ స‌పోర్ట్, 458 పిక్సెల్స్ సూప‌ర్ రెటీనా స్క్రీన్, మ‌నుషుల‌ను అనుక‌రించే స‌రికొత్త 3డీ యానిమోజీలు వంటి ప్ర‌త్యేక‌త‌లు ఉండ‌డంతో ఈ ఫోన్ ను తొలిరేజే సొంతం చేసుకోవాల‌ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా వినియోగ‌దారులు షాపుల ముందు బారులు తీరారు. ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న వారు, క్యూల‌లో ప‌డిగాపులు ప‌డ్డ‌వారు ఎట్ట‌కేల‌కు  ఐఫోన్ Xను సొంతం చేసుకున్నారు. అయితే, తాము మెచ్చిన ఫోన్ ను సొంతం చేసుకున్నామ‌నే ఆనందం వారికి ద‌క్క‌లేదు. కొంత‌మంది వినియోగ‌దారుల‌కు ఈ ఫోన్ యాక్టివేట్ చేయ‌డం సాధ్యం కాక‌పోవ‌డంతో వారు తీవ్ర నిరుత్సాహానికి గుర‌య్యారు.

మొద‌టి రోజు కొన్ని ఐఫోన్ X  ఫోన్లు మొరాయించాయి. వైఫై కనెక్ష‌న్ ఉన్న‌ప్ప‌టికీ ఈ ఐ ఫోన్ల‌కు ఎక్స్-సిరీస్ కనెక్ట్ కాలేదు. చాలామంది వినియోగ‌దారుల‌కు యాక్టివేషన్ సర్వర్ ఈజ్ టెంపరర్లీ అన్-ఎవైలబుల్ అనే మెసేజ్ వ‌చ్చింది. దీంతో, ఐట్యూన్స్ కు కనెక్ట్ అవ్వ‌మ‌ని చాలా మంది వినియోగ‌దార్ల‌కు సూచ‌న‌లు వ‌చ్చాయి. ఈ ర‌కంగా తొలిరోజే కొంద‌రు వినియోగ‌దారులు తీవ్ర ఇబ్బందుల‌ను ఎదుర్కొన్నారు. కొన్ని గంట‌ల‌పాటు ఇదే స‌మ‌స్య చాలా మందికి రావ‌డంతో వారంతా ఆందోళ‌న‌కు గురయ్యారు. కొత్త‌వి స‌రిగా ప‌నిచేయ‌క‌పోవ‌డంతో చాలామంది వినియోగ‌దారులు త‌మ పాత ఐఫోన్ల‌నే వాడుకున్నారు.

ఐఫోన్ X లో ఏర్ప‌డిన స‌మ‌స్య‌ల‌పై యాపిల్ సంస్థ ఆల‌స్యంగా స్పందించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా దాదాపు 5గంటల‌పాటు వినియోగ‌దారులు ఇబ్బందిప‌డ్డ త‌ర్వాత ఆ సమస్యలను ప‌రిష్క‌రించేందుకు యాపిల్ కొన్ని సూచ‌న‌లు చేసింది. ఈ స‌రికొత్త మోడల్ ఫోన్ ను ఏవిధంగా యాక్టివేట్ చేయాలో తెలియ‌జేస్తూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. వినియోగ‌దారుల ఫిర్యాదుల‌పై వెంట‌నే స్పందించే విధంగా ఆన్ లైన్ వేదికలను కూడా ఏర్పాటుచేసింది. అయితే, అన్ని నెట్ వర్క్ క్యారియర్లను సపోర్ట్ చేసేలా సాఫ్ట్ వేర్ ను రూపొందించకపోవడం వల్లనే ఈ సమస్య వచ్చినట్టు ఐటీ నిపుణులు చెబుతున్నారు. అయితే, ప్ర‌తిష్టాత్మ‌కంగా విడుద‌ల చేసిన ఐఫోన్ X...తొలిరోజే ఇబ్బందిపెట్ట‌డంపై వినియోగ‌దారులు అసంతృని వ్య‌క్తం చేస్తున్నారు. ఇటువంటి స‌మ‌స్య‌ల‌న్నీ ఫిక్స్ చేసిన త‌ర్వాతే ఫోన్ ను విడుద‌ల చేసి ఉండాల్సింద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.
Tags:    

Similar News