బెంగ‌ళూరులో ఐఫోన్ల త‌యారీ

Update: 2017-02-03 11:22 GMT
టెక్నాల‌జీ దిగ్గజం ఆపిల్ త‌న ఐఫోన్ వినియోగ‌దారుల‌కు ఇక నుంచి మ‌న‌దేశంలోనే త‌యారైన ఫోన్ల‌ను అందించ‌నుంది. ఇండియాలోనే ఐఫోన్ల త‌యారీని ప్రారంభించ‌నుండ‌ట‌మే ఇందుకు కార‌ణం. ఈ ఏడాది ఏప్రిల్ చివ‌రి క‌ల్లా బెంగ‌ళూరులో ఐఫోన్ల త‌యారీ ప్రారంభం కానున్న‌ట్లు క‌ర్ణాట‌క ఐటీ మంత్రి ప్రియాంక్ ఖ‌ర్గే వెల్ల‌డించారు. తైవాన్‌ కు చెందిన విస్ట్రన్ కార్ప్‌ తో క‌లిసి ఈ యూనిట్‌ ను ప్రారంభించాల‌ని ఆపిల్ భావిస్తున్నట్లు చెప్పారు. గ‌త జ‌న‌వ‌రిలోనే దీనికి సంబంధించి ఆపిల్ ప్ర‌తినిధులు త‌నతో చ‌ర్చ‌లు జ‌రిపార‌ని  క‌ర్ణాట‌క ఐటీ మంత్రి ప్రియాంక్ ఖ‌ర్గే తెలిపారు. ఈ చ‌ర్చ‌లు కొలిక్కి వ‌చ్చాయ‌ని, త్వ‌రలో అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డి ఏప్రిల్ నుంచి త‌యారీ ప్రారంభం అవుతుంద‌ని మంత్రి మీడియాకు వివ‌రించారు. అయితే బెంగ‌ళూరులో ఐఫోన్ల త‌యారీపై ఆపిల్ సంస్థ ఇంకా అధికారికంగా స్పందించ‌లేదు. 

ఇదిలాఉండ‌గా....ఇండియాలో ఐఫోన్ల తయారీకి ఆపిల్ సీఈవో టిమ్ కుక్ గ‌తంలోనే ఆస‌క్తి వ్య‌క్తంచేశారు. దీంతో ఇండియాలో ఐఫోన్ల తయారీపై గ‌త కొన్ని నెల‌లుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. అదే స‌మ‌యంలో చైనా లాంటి మేజ‌ర్ మార్కెట్ల‌లో ఐఫోన్‌ సేల్స్ త‌గ్గుతుండ‌టంతో ఆపిల్ క‌న్ను భార‌త్‌ పై ప‌డింది. దీంతో 2016లో ఇండియాలోకి 25 ల‌క్ష‌ల ఐఫోన్లు వ‌చ్చాయి. ఇండియాలో గ‌తంలో ఎన్న‌డూ లేనంత ఆదాయం గ‌తేడాది ఆపిల్ ఆర్జించింది. అయితే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆపిల్ ఉత్ప‌త్తుల అమ్మ‌కాల్లో భార‌త్ వాటా కేవ‌లం రెండు శాత‌మే. కాగా, భారత్‌ లో తయారీ కేంద్రం ఏర్పాటుకు అదనపు రాయితీలు ఇవ్వాల్సిందిగా గ‌తంలో ఆపిల్ కేంద్ర ప్ర‌భుత్వానికి ప్రతిపాదనలు పెట్టుకుంది. దీనిపై కొద్దికాలం క్రితం కేంద్ర వాణిజ్య - పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఆపిల్ ప్ర‌తిపాద‌న‌ల‌ను ప్రభుత్వం పరిశీలిస్తోందని వెల్ల‌డించారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం అధికారికంగా వెలువ‌డ‌లేదు. అయితే ఈ నేప‌థ్యంలో క‌ర్ణాట‌క శాఖా మంత్రి ప్ర‌తిపాద‌న ఆస‌క్తిక‌రంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News