యాపిల్ స్టోర్ల ఎంట్రీ మ‌రింత ఆల‌స్య‌మేన‌ట‌!

Update: 2017-07-11 05:10 GMT
టెక్నాల‌జీ దిగ్గ‌జం యాపిల్ భార‌త మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఉవ్విళ్లూరుతోంది. అవ‌కాశం కోసం ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తోంది. అయితే ఆ కంపెనీ ఆశ‌ల‌న్నీ ఎప్ప‌టిక‌ప్పుడు అడియాశ‌లుగానే మారిపోతున్నాయి. యాపిల్ వ‌స్తానంటే... ఎవ‌రు వ‌ద్దంటారు చెప్పండి? అనేగా మీ ప్ర‌శ్న‌. ఇంకొక‌ళ్లైతే ప‌రిస్థితి ఎలా ఉండేదో గానీ... భార‌త ప్ర‌భుత్వం మాత్రం ఆ దిశ‌గా ప్ర‌తిస్పందించ‌డం లేద‌న్న వాద‌న కాస్తంత గ‌ట్టిగానే వినిపిస్తోంది. ఈ క‌థాక‌మామీషు పూర్తి వివ‌రాల్లోకెళితే... యాపిల్ ఉత్ప‌త్తి చేస్తున్న ఐ ఫోన్ల‌కు విశ్వ‌వ్యాప్తంగా య‌మా గిరాకీ ఉన్న సంగ‌తి తెలిసిందేగా. మిగిలిన దేశాల‌తో పోలిస్తే... భార‌త్‌లో ఐ ఫోన్ల‌కు ఎల‌లేని గిరాకీ ఉన్న విష‌యం కూడా కాద‌న‌లేనిదే. ఇక్క‌డి మార్కెట్ ప‌రిస్థితుల‌ను అంచ‌నా వేసిన యాపిల్‌... ఇక‌పై తానే భార‌త్‌ లో త‌న ఉత్ప‌త్తుల‌ను విక్ర‌యించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. అందుక‌నుగుణంగా దేశంలోని ప‌లు ప్ర‌ధాన న‌గ‌రాల్లో సొంతంగా ఔట్ లెట్ల‌ను ఏర్పాటు చేసుకోవాల‌ని కూడా ఆ కంపెనీ నేరుగానే రంగంలోకి దిగిపోయింది.

ప్ర‌స్తుతం యాపిల్ త‌యారు చేస్తున్న ఉత్ప‌త్తుల‌ను మ‌నం ఆన్‌ లైన్‌ లోనో, లేదంటే మ‌ల్టీ బ్రాండెడ్ స్టోర్ల‌లోనో దొరుకుతున్నాయి. తామే త‌మ ఉత్ప‌త్తుల‌ను నేరుగా వినియోగ‌దారుడికి అంద‌జేస్తే... మ‌రింత మేర లాభం పొంద‌వ‌చ్చ‌న్న ఉద్దేశంతోనే యాపిల్ ఇక్క‌డ త‌న సొంత స్టోర్ల‌ను ఏర్పాటు చేయాల‌ని త‌లచింది. ఇత‌ర దేశాల్లోని త‌న సొంత స్టోర్ల కంటే కూడా భారీ ఎత్తున‌, మ‌రింత పెద్ద‌గా భార‌త్ లో ఏర్పాటు చేయాల‌ని ఆ సంస్థ త‌ల‌చింది. ముందుగా దేశ రాజధాని ఢిల్లీ - ముంబైల‌లో రెండు స్టోర్ల‌ను ఏర్పాటు చేసేందుకు రంగంలోకి దిగింది. ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వానికి ద‌ర‌ఖాస్తు చేసుకున్న ఆ సంస్థ... తాను ఏర్పాటు చేయ‌బోయే ఔట్ లెట్ల కోసం స్థ‌లాల ప‌రిశీల‌న‌ను కూడా ప్రారంభించింది. యాపిల్ ప్లాన్ ప్ర‌కారం ఈ రెండు నగ‌రాల్లో 10 వేల చ‌ద‌ర‌పు అడుగుల మేర స్థ‌లం ప్రైమ్ లొకాలిటీలో దొర‌కాలి.

అయితే ఈ రెండు న‌గ‌రాల్లోనూ ఇంత పెద్ద స్థ‌లం ప్రైమ్ లొకేష‌న్‌ లో ల‌భ్య‌మ‌య్యే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. ప్ర‌భుత్వం జోక్యం చేసుకుంటే త‌ప్పించి ఈ దిశ‌గా యాపిల్‌ కు అవ‌స‌ర‌మైన మేర స్థ‌లం ల‌భించే ప‌రిస్థితి లేదు. ఇక ప్ర‌భుత్వం నుంచి కూడా ఆ సంస్థ‌కు ఇప్ప‌టిదాకా అనుమ‌తులే మంజూరు కాలేదు. విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డుల‌కు అనుమ‌తులు ఇవ్వ‌డంలోనే నాన్చుడు ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్న న‌రేంద్ర మోదీ స‌ర్కారు... ఇక యాపిల్ కు అవ‌స‌ర‌మ‌య్యే స్థ‌లాల‌ను ఎక్క‌డ చూసి పెడుతుంది చెప్పండి. అందుకే ఏడాదిలోగా మ‌న‌కు అందుబాటులోకి వ‌స్తాయ‌నుకున్న యాపిల్ స్టోర్లు మ‌రో రెండేళ్లు గ‌డిచినా... అందుబాటులోకి వ‌స్తాయా?  రావా? అన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.


Tags:    

Similar News