ఆర్టీసీ తాజా ఐడియా వర్క్ వుట్ అవుతుందా?

Update: 2016-03-25 05:25 GMT
నష్టాలతో సతమతమవుతూ.. ఆక్యుపెన్సీ విషయంలో కిందామీదా పడుతున్న ఏపీ ఆర్టీసీ తాజాగా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇలాంటి నిర్ణయం సంస్థ ఇమేజ్ ను మార్చటంతోపాటు.. సంస్థకు ప్రయోజనం కలిగించే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. ప్రైవేటు ఆపరేటర్లతో పోటీ పడేలా తాజా నిర్ణయం ఉండటం విశేషం. సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా.. తాజా విధానం ఉండటం ఆసక్తికరంగా మారింది.

విమానం తరహా విధానంలో బస్సు ఛార్జీల్నివసూలు చేయాలన్నది తాజా కాన్సెప్ట్ గా చెప్పొచ్చు. తాజా విధానాన్ని సింఫుల్ గా మూడు ముక్కల్లో చెప్పాలంటే.. ఎంత ముందుగా సీటును రిజర్వ్ చేసుకుంటూ.. అంత తక్కువ ధరకు బస్సు టిక్కెట్ ఛార్జీలు ఉండటం గమనార్హం. తాము ప్రయాణించే తేదీకి కనీసం వారం నుంచి నెల రోజుల ముందే టిక్కెట్టు కానీ బుక్ చేసుకుంటే.. ఛార్జీలో 5 శాతం నుంచి 20 శాతం వరకూ ఛార్జీలు తగ్గే అవకాశం ఉండటం గమనార్హం.

ఈ విధానానికి సంబంధించిన సరికొత్త సాఫ్ట్ వేర్ ను ఏపీఎస్ ఆర్టీసీ రూపొందించింది. ఏప్రిల్ లో అమలు చేయాలని భావిస్తున్న సరికొత్త బుకింగ్ విధానంలో.. మూడు పద్ధతులు ఉంటాయని చెబుతున్నారు. వారం ముందు కానీ ఏపీ ఆర్టీసీ బస్సు టిక్కెట్టును రిజర్వ్ చేసుకుంటే 5 శాతం రాయితీ లభిస్తుంది. అదే 15 రోజుల ముందు కానీ బస్సు టిక్కెట్టును బుక్ చేసుకుంటే 10 శాతం మేర రాయితీ లభిస్తుంది. ఇక..నెల రోజుల ముందే ప్రయాణ టిక్కెట్టును బుక్ చేసుకుంటే ఏకంగా 20 శాతం రాయితీ లభించే వీలుంది.

అదే సమయంలో.. ప్రయాణ తేదీకి గడువు దగ్గర పడే కొద్దీ.. ప్రయాణ ఛార్జీల్ని డైనమిక్ విధానంలో పెంచేలా నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. ఎంత ముందుగా టిక్కెట్టు కొనుగోలు చేస్తే అంతగా (గరిష్ఠంగా 20 శాతం) లబ్థి పొందే అవకాశం ఉంటుంది. అదే సమయంలో.. గడువు ముందు.. డిమాండ్ కు తగ్గట్లుగా ధరలు ఉండనున్నాయి.

అంటే.. ఏదైనా రూట్ కి సంబంధించి ఒక బస్సులో ఒక రోజు ముందు టిక్కెట్టు బుక్ చేసుకోవాలని అనుకుంటే.. సదరు రూట్ లో బుకింగ్ ల డిమాండ్ ఎక్కువగా ఉంటే.. మామూలు ధర కంటే ఎక్కువగా ఉండే వీలుంది. అదే సమయంలో తక్కువగా ఉంటే మామూలు ఛార్జ్ ఉండనుంది. ఈ విధానంలో ముందస్తుగా ప్లాన్ చేసుకునే వారికి లాభం.. చివరి నిమిషంలో ప్రయాణం చేయాలనుకునే వారికి భారంగా  (డిమాండ్ ఉంటే) మారే వీలుంది. మరి.. ఈ కొత్త విధానానికి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
Tags:    

Similar News