బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి ఏపీకి మరికొన్ని రోజులు వెళ్లలేరు

Update: 2020-05-16 11:33 GMT
కారణం ఏమైనా కావొచ్చు.. లాక్ డౌన్ వేళ హైదరాబాద్ లో ఇరుక్కుపోయినోళ్లు ఎంతోమంది. వివిధ కారణాలతో మహానగరానికి వచ్చి.. అనూహ్యంగా విధించిన లాక్ డౌన్ తో నగరంలోనే ఉండిపోయారు. చూస్తుండగానే ఎనిమిది వారాలు పూర్తి అయ్యాయి. అత్యవసరాలు ఉన్న వారు కిందా మీదా పడి ఏపీతో పాటు తమ రాష్ట్రాలకు వెళ్లిపోతే.. మిగిలిన వారు మాత్రం భారీ సంఖ్యలో ఉండి పోయారు.

ఇలా ఉన్న వారంతా ఏపీ సర్కారు నిర్వహిస్తున్న స్పందన వెబ్ సైట్లో తమ పేర్లను నమోదు చేసుకొని.. ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. ఇలా ఉన్నోళ్లు దగ్గర దగ్గర 13వేల మంది వరకూ ఉంటారని చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లేందుకు ఇప్పటికే భారీగా దరఖాస్తులు చేసుకున్న వారిలో చాలా మంది ఏపీఎస్ ఆర్టీసి ప్రకటించిన బస్సుల్లో ప్రయాణాలకు టికెట్లు బుక్ చేసుకున్నారు.

రానున్న కొద్ది రోజుల్లో ఏపీకి వెళ్లి పోవచ్చని సంతోషంగా ఉన్నవారికి తాజాగా బ్యాడ్ న్యూస్ ఒకటి వచ్చేసింది. ఇప్పటి వరకూ ఉన్న సమాచారం ప్రకారం ఈ నెల 16నుంచి హైదరాబాద్ నుంచి ఏపీకి బస్సుల్ని నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. దీనికి సంబంధించి ముందస్తు గానే టికెట్లను బుక్ చేసుకున్నారు. అయితే..సాంకేతిక కారణాలతో ఈ బస్సు సర్వీసుల్ని తాత్కాలికంగా బంద్ చేశారు.

ఎందుకిలా ఉంటే.. వేలాదిమంది ఒక్కసారిగా ఏపీకి వచ్చేస్తే.. వారి ఆరోగ్య స్థితిగతుల్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవటం కష్టమవుతుందన్న ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే.. పరిస్థితులు మరింత కుదుట పడే వరకూ ప్రత్యేక బస్సు సర్వీసుల్ని నిలిపేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. తమ సొంతూళ్లకు వెళ్లి పోవచ్చన్న సంతోషం లో ఉన్న వారందరికి తాజా పరిణామం షాకింగ్ గా మారుతుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News