ఈ సమీక్షల వల్ల ఉపయోగముంటుందా?

Update: 2022-07-28 05:13 GMT
రెండు రోజులుగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వరసబెట్టి సమీక్షలు నిర్వహిస్తున్నారు. విభజన చట్టంలో భాగంగా ఏపీలో చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షలు జరిపారు. ఉన్నత విద్యాలయాలను ఏర్పాటు చేయమన్నారు. పెండింగులో ఉన్న అనుమతులకు వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలన్నారు. వీటితో పాటు అనేక సంస్ధల ఏర్పాటును కూడా కేంద్రమంత్రులు, ఉన్నతాధాకారులను తన దగ్గరకు పిలిపించుకుని చర్చించారు. అంతాబాగానే ఉంది అసలు ఇపుడు వీటన్నింటిపై ఎందుకు సమీక్షిస్తున్నారో అర్ధం కావటంలేదు.

వెంకయ్య సమీక్షలు చేయకూడదని రూలేమీ లేదు. కాకపోతే మరో 15 రోజుల్లో పదవిలో నుండి దిగిపోతున్న సమయంలో సమీక్షల వల్ల ఏమన్నా ఉపయోగాలున్నాయా అన్నదే అనుమానాలు.

పదవిలో నుంది దిగిపోయే వాళ్ళు చేసే సమీక్షలు, ఇచ్చే ఆదేశాలను ఎవరు పట్టించుకోరన్న విషయం అందరికీ తెలుసు. ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇలాంటి సమీక్షలు చేసింది చాలా తక్కువనే చెప్పాలి. అలాంటిది ఆగష్టు 10వ తేదీన టర్మ్ పూర్తయిపోతున్నపుడు సమీక్షలు చేసినా పెద్ద ఉపయోగముండదు.

2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పాటైన దగ్గరనుండి ఏపీ ప్రయోజనాలను తుంగలో తొక్కేస్తున్న విషయం వెంకయ్య చూస్తూనే ఉన్నారు. అప్పట్లో కేంద్రమంత్రిగా ఉండి కూడా రాష్ట్రానికి దక్కాల్సిన ప్రత్యేక హోదా, విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ లాంటి అంశాలను పట్టించుకోలేదు.

పైగా ప్రత్యేక హోదా సాధించేసినట్లు విశాఖపట్నం, విజయవాడలో పౌర సన్మానం కూడా చేయించుకున్నారు. ఏపీకి చెందిన వ్యక్తి దేశ ఉపరాష్ట్రపతిగా ఉన్నా రాష్ట్రానికి దక్కాల్సిన ప్రాధాన్యత అయితే దక్కలేదు.

చివరకు  విభజన చట్టం అమలులో తెలంగాణాతోనే ఎన్ని సమస్యలున్నా ఒక్కటికూడా పరిష్కారం కాలేదు. ఈ విషయంలో కూడా వెంకయ్య చొరవ చూపించి కేంద్రమంత్రి అమిత్ షా తో కానీ లేదా ఉన్నతాధికారుల ద్వారా కానీ పరిష్కారమయ్యేట్లు చేయలేదు. విభజన కారణంగా అన్ని విధాల నష్టపోయిన ఏపీని ఆదుకునేందుకు తనకున్న అధికారాలను కూడా వెంకయ్య ఉపయోగించలేదనే మంట జనాల్లో ఉంది. ఏదో రకంగా ఐదేళ్ళు గడిపేసిన వెంకయ్య చివరి రోజుల్లో చేసే సమీక్షలకు ఏమన్నా విలువుంటుందా ?
Tags:    

Similar News