మైనస్‌ మార్కులు కాదు.. మోడీకి ఫుల్‌మార్క్స్‌!

Update: 2015-05-24 04:30 GMT
ఒకవైపు కాంగ్రెస్‌ యువరాజు రాహుల్‌గాంధీనేమో మోడీ పాలనకు సున్నా మార్కులే అంటాడు. మరోవైపు కమ్యూనిస్టులు మోడీకి మైనస్‌ మార్కులు వేస్తున్నామని ప్రకటించారు. అయితే భారతీయ జనతా పార్టీ నేతలు మాత్రం అలా కాదు.. మోడీకి ఫుల్‌ మార్క్స్‌ అని అంటున్నారు! తమకు తాము వారు సంపూర్ణంగా మార్కులేసుకొని.. తమ పాలన పట్ల ప్రజలు ఫుల్‌ సంతృప్తితో ఉన్నారని కితాబులిచ్చుకొంటున్నారు!

    ఈ మేరకు కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ ఒక ప్రకటన చేశాడు. మోడీ పాలన ఏడాది పూర్తి అయిన తరుణంలో ఆయన మాట్లాడుతూ మోడీ విషయంలో ప్రజలు పూర్తిస్థాయిలో సంతృప్తిగా ఉన్నారని అన్నారు. పాలన విషయంలో మోడీకి వందకు వంద మార్కులు పడతాయని ఆయన వ్యాఖ్యానించాడు. మరి ఎంతైనా భారతీయ జనతా పార్టీ నేత.. మోడీ గారి మంత్రి కాబట్టి అరుణ్‌జైట్లీ ఇలా మాట్లాడటంలో విశేషం ఏమి లేకపోవచ్చు.

    ఇంకో విశేషం ఏమిటంటే.. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల విషయంలో కూడా అరుణ్‌జైట్లీ ఒక సవాలు విసిరాడు. ఆ రాష్ట్రంలో తమే అధికారాన్ని సొంతం చేసుకొంటామని ఆయన వ్యాఖ్యానించాడు. బిహార్‌లో నితీష్‌కుమార్‌, లాలూ ప్రసాద్‌ యాదవ్‌లు చేతులు కలపడం అనైతికం అని అరుణ్‌జైట్లీ వ్యాఖ్యానించాడు. వారు చేతులు కలిపినా తమ విజయాన్ని అయితే అడ్డుకోలేరని ఈ ఆర్థిక శాఖమంత్రి వర్యులు ప్రకటించారు.

    మరి బిహార్‌లో గెలుస్తామని కాన్ఫిడెన్స్‌ను ప్రకటించే వరకూ ఓకే కానీ... విలువలు.. నైతికత అంటూ రాజకీయ నేతలు మాట్లాడటం మాత్రం కొంత ఎబ్బెట్టుగా ఉంటుంది. అది ఎవరైనా అందరూ ఆ తానులోని ముక్కలే కదా!


Tags:    

Similar News